Payyavula Keshav: చంద్రబాబు కాబట్టి సరిపోయింది!: పయ్యావుల
- జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
- హాజరైన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
- చంద్రబాబుకు అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి
- గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపణ
ఏపీ ప్రభుత్వం ఇవాళ జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తూ... ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి, ప్రభుత్వ పాలనను సమీక్ష చేసుకుని, సరిదిద్దుకుంటూ ముందుకు పోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను, ఆదేశాలను అమలు చేయడం కోసం మనమందరం ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యామని పేర్కొన్నారు.
"సీఎం చంద్రబాబుతో నా ప్రస్థానం 30 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత ఆరాటం, తపనతో పనిచేశారో... 30 ఏళ్ల తర్వాత కూడా అంతకుమించిన ఉత్సాహంతో ఆయన పనిచేస్తుండడం ఇవాళ చూస్తున్నాం. ఆయన వెంట సుదీర్ఘకాలం నడిచిన వ్యక్తిగా... ఆయనలో నాకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మిగిలిన జీవితం ఇక ప్రజల కోసమే అనే ఒక ప్రధాన లక్ష్యంతో, ప్రతి విషయంలోనూ ఒక మానవతా కోణం ఉండాలని ఆయన పడుతున్న తపన మనందరికీ స్ఫూర్తిదాయకం.
అయితే, ఇది సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేందుకు సమయం కాదు... క్లుప్తంగా విషయం వివరిస్తాను. నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయనకు వారసత్వంగా వచ్చింది... రూ.10 లక్షల కోట్ల అప్పు! అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి! అప్పులపై వడ్డీ చెల్లించడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి!
గత ఏడాది రాష్ట్ర ఆదాయంలో 99 శాతం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంతకుముందు సంవత్సరం చూస్తే.. జీతాలు చెల్లించడానికి కూడా అప్పులు చేశారు. చెల్లించాల్సిన బకాయిలే రూ.1.30 లక్షల కోట్లు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే... ప్రతి వ్యవస్థను నాశనం చేశారు.
ఒకవైపు అప్పులు, మరోవైపు రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులు... ఇవీ చంద్రబాబుకు వారసత్వంగా వచ్చిన అంశాలు. మామూలు వ్యక్తి అయితే ఇలాంటి సమస్యలతో నిద్ర కూడా పోలేరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. చంద్రబాబు ఎంతో సమర్థతతో ఒక్కో అంశాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నారు" అని పయ్యావుల వివరించారు.