Rahul Gandhi: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గులాబీ పువ్వు ఇచ్చిన రాహుల్ గాంధీ
- విభిన్న రీతిలో విపక్ష ఎంపీల నిరసన
- ఎన్డీయే ఎంపీలకు గులాబీ పూలు, తిరంగా జెండాల అందజేత
- పార్లమెంట్ వెలుపల నిరసన కార్యక్రమం
- రాజ్యసభ రేపటికి వాయిదా
అదానీపై అమెరికాలో నమోదయిన లంచం అభియోగాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించాలంటూ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) వినూత్న నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీలకు కాంగ్రెస్ సభ్యులు గులాబీ పూలు, తిరంగా జెండాలను అందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గులాబీ పువ్వు, తిరంగా జెండాను అందించారు. మకర ద్వారం మెట్ల వద్ద వేచివుండి రాజ్‌నాథ్ సింగ్ రాగానే నవ్వుకుంటూ దగ్గరికి వెళ్లి గులాబీ చేతికిచ్చారు. దానిని స్వీకరించిన మంత్రి పార్లమెంట్‌లోకి వెళ్లారు.
కాగా ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, డీకేఎంకే, జేఎంఎం, వామపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా జాతీయ జెండాలు, ఎర్ర గులాబీలను పట్టుకుని నిలబడ్డారు. ఈ నిరసనపై కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ మాట్లాడుతూ... జాతీయ జెండాను పంపిణీ చేసి ఈ దేశాన్ని విక్రయించవద్దని, దేశాన్ని ముందుకు నడిపించాలని ఎన్డీయే ఎంపీలను అభ్యర్థించామని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు అదానీ ఈ దేశాన్ని నడుపుతున్నట్టుగా గమనించవచ్చని అన్నారు. అదానీకి అన్నీ ఇచ్చి పేదల గొంతుకను నొక్కుతున్నారని, దేశాన్ని విక్రయించే కుట్రకు తాము వ్యతిరేకమని గైక్వాడ్ అన్నారు. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతృత్వంలో రోజువారీగా చేపడుతున్న నిరసన ప్రదర్శనల్లో ఇది మరో ఆందోళన అని ఆయన తెలిపారు. అదానీ వ్యవహారంతో పాటు అన్ని ముఖ్యమైన అంశాలపై సభలో చర్చకు విజ్ఞప్తి చిహ్నంగా ఈ నిరసన చేపట్టామని వివరించారు.
కాంగ్రెస్ ఎంపీలు గులాబీ పూలు పంపిణీ చేయడంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ధ్వజమెత్తారు. ఇదంతా డ్రామా అని, పిల్లచేష్టల విధానాలని విమర్శించారు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ కూడా ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని, ఈ విధంగా పార్లమెంట్ వెలుపల వీడియోలు చిత్రీకరించడం ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. మరోవైపు, ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు, సోనియా గాంధీ-సోరోస్ వ్యవహారాల నేపథ్యంలో సభలో ఆందోళనలు నెలకొనడం ఇందుకు కారణమైంది.