Elon Musk: ఢిల్లీలో టెస్లా కార్ల షోరూం.. అనువైన స్థలం కోసం వెతుకులాట

Tesla restarts search for New Delhi showroom sources say

  • రియల్ ఎస్టేట్ దిగ్గజాలతో టెస్లా కంపెనీ చర్చలు
  • 3 నుంచి 5 వేల చదరపు మీటర్ల స్థలం కోసం గాలింపు
  • పరిశీలనలో సౌత్ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్ కు రానుందా.. ఢిల్లీలో షోరూం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే బిజినెస్ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. త్వరలో ఢిల్లీ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయనున్నాయని పేర్కొన్నాయి. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. ఈమేరకు జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే, 100 శాతం పన్ను చెల్లించి కార్లను దిగుమతి చేసి అమ్ముతుందా? లేక భారత్ లో పెట్టుబడులకు హామీ ఇచ్చి కొత్త విధానం ప్రకారం 15 శాతం పన్ను చెల్లించి దిగుమతి చేస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.

షోరూం ఏర్పాట్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, 3 వేల నుంచి 5 వేల చదరపు మీటర్ల స్థలం కోసం టెస్లా కంపెనీ వెతుకుతున్నట్లు సమాచారం. కన్జ్యూమర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, దీనికి మూడురెట్ల స్థలంలో డెలివరీ, సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని టెస్లా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ అవెన్యూ మాల్‌, సైబర్‌ హబ్‌ ఆఫీస్‌, గురుగ్రామ్‌లోని ఓ రిటైల్‌ కాంప్లెక్స్‌ లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భారత్ లో ఎలాన్ మస్క్ రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఈ ఏడాది ప్రారంభంలో ప్రచారం జరిగింది. భారతదేశంలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని స్వయంగా మస్క్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత టెస్లా అమ్మకాలు పడిపోవడంతో భారత్ లో పెట్టుబడుల ప్రణాళికను ఆ కంపెనీ పక్కన పెట్టింది. తాజాగా షోరూం ఏర్పాటు కోసం ఢిల్లీలో స్థలం కోసం టెస్లా కంపెనీ అన్వేషిస్తోంది.

  • Loading...

More Telugu News