Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ

Arvind Kejriwal reiterates that AAP will contest Delhi elections alone

  • ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పునరుద్ఘాటన
  • కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ప్రకటన
  • లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి దెబ్బతిన్న ఇరుపార్టీలు
  • అందుకే పొత్తుకు కేజ్రీవాల్ వెనుకడుగు!

వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ఆప్ బరిలోకి దిగబోతోందంటూ వెలువడుతున్న ఊహాగానాలపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్-ఆప్ పొత్తు ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. సొంత బలంతోనే ఎన్నికల్లో పోరాడతామని, హస్తం పార్టీతో ఎలాంటి పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు చివరి దశలో ఉన్నాయంటూ మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తును ఆప్ తోసిపుచ్చడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో కూడా కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. వరుసగా మూడోసారి ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండానే బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. కాగా ఆప్ 2015 నుంచి ఢిల్లీలో అధికారంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయాలని 26 ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి భావిస్తోంది. అయితే కేజ్రీవాల్ మాత్రం పొత్తుకు ససేమిరా అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాయి. ఢిల్లీ పరిధిలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వెళ్లడంపై కేజ్రీవాల్ పునరాలోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News