Mohammad Shami: పేసర్ మహ్మద్ షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!

Mohammad Shami has undergone a fresh fitness test and not ready for test cricket

  • ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైనట్టు కథనాలు
  • టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేనట్టే
  • బెంగాల్-బరోడా రంజీ మ్యాచ్‌లో మరోసారి ఫిట్‌నెస్ పరీక్షకు అవకాశం

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుభవంలేని పేసర్లతో బరిలోకి దిగడంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో అనుభవజ్ఞుడైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల్లో ఆడతాడని, ఈ మేరకు త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఫిట్‌నెస్ పరంగా షమీ సిద్ధంగా ఉన్నట్టేనని భావించిన తరుణంలో అనూహ్య కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. 

షమీ తాజాగా మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకున్నాడని, 5 రోజుల పాటు జరిగే టెస్ట్ క్రికెట్‌కు షమీ ఇంకా సంసిద్ధంగా లేడని తేలిందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్నాడనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా బరోడా-బెంగాల్ జట్ల మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో షమీ ఆడనున్నాడని, అక్కడ మరోసారి అతడి ఫిట్‌నెస్, మోకాలి సమస్యలను పరీక్షించనున్నారని పేర్కొంది. 

బెంగాల్ జట్టు తరపున టీ20ఫార్మాట్ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా మోకాలి వాపు సమస్య ఎదుర్కొన్నాడని, టెస్ట్ ఫార్మాట్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయడానికి సిద్ధంగా లేనట్టేనని సందేహాలు వ్యక్తం చేసింది. కాగా మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత బెంగాల్ జట్టు తరపున షమీ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో బెంగాల్‌ తరపున ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించాడు.

కాగా మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మీడియా సమావేశంలో స్పందించాడు. షమీ 100 శాతం ఫిట్‌నెస్‌ ఉంటే తప్ప అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. అతడు ఆడటానికి తలుపులు తెరిచే ఉంటాయని, అయితే ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలన్నాడు. మోకాలి వాపు సమస్య ఎదుర్కొంటున్నాడని తెలిపాడు.

  • Loading...

More Telugu News