Shaheen Afridi: చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ తొలి బౌలర్‌గా రికార్డు!
- మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన పాక్ తొలి బౌలర్‌గా ఘనత
- డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 3 వికెట్లు తీసి రికార్డుకెక్కిన పేసర్
- ఇప్పటివరకు వన్డేలలో 112, టెస్టుల్లో 116 వికెట్లు సాధించిన 24 ఏళ్ల లెఫ్టార్మ్ సీమర్
పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టీ20)లో 100 వికెట్లు పడగొట్టిన పాకిస్థాన్ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. మంగళవారం డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ పేసర్ 3 వికెట్లు తీసి ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మూడు వికెట్లతో టీ20ల్లో అఫ్రిది 100 వికెట్లను పూర్తి చేశాడు. ప్రతి ఫార్మాట్‌లో 100 వికెట్లు సాధించిన మొదటి పాకిస్థాన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ 24 ఏళ్ల లెఫ్టార్మ్ సీమర్ ఇప్పటివరకు వన్డేలలో 112, టెస్టుల్లో 116 వికెట్లు తీశాడు.
ఇక టీ20ల్లో 100 వికెట్లు తీసిన మూడవ పాకిస్థానీ బౌలర్ అఫ్రిది. అతని కంటే ముందు హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ ఈ మైలురాయిని సాధించారు. రౌఫ్ కేవలం 71 మ్యాచుల్లోనే ఈ ఫీట్‌ను అందుకోగా, అఫ్రిది 74 టీ20ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
కాగా, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు మాత్రం షాహీన్ అఫ్రిది. అలాగే ఈ ఫీట్ సాధించిన టిమ్ సౌథీ (న్యూజిలాండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), లసిత్ మలింగ (శ్రీలంక) సరసన చేరాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాప్రికాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. 184 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పాక్ 173 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు 74 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.