rajnath singh: రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రాజ్ నాథ్ సింగ్ కీలక భేటీ
- మూడు రోజుల రష్యా పర్యటనలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ఇరుదేశాల రక్షణ సంబంధాలపై కూలంకషంగా చర్చించామన్న రాజ్‌నాథ్ సింగ్
- రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన రాజ్‌నాథ్ సింగ్
మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రష్యా రక్షణశాఖ మంత్రి అండ్రీ బెలోవ్‌సోవ్ కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారంపై చర్చించారు. భారత్ - రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలటరీ టెక్నికల్ కో ఆపరేషన్‌పైనా ఫలవంతమైన చర్చలు జరిగినట్లు రాజ్‌నాథ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత్, రష్యా మధ్య స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై కూలంకషంగా చర్చించామని, రెండు దేశాలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్ఠమయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయని పేర్కొన్నారు.
రాజ్‌నాథ్ తాజా పర్యటన నేపథ్యంలో రష్యాలోని భారత దౌత్య కార్యాలయం స్పందిస్తూ .. భారత్ - రష్యా సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని వెల్లడించింది.