Henry Olonga: పెయింటర్‌గా మారిన జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్ హెన్రీ ఒలోంగా!
- అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో పెయింటింగ్ చేస్తూ కనిపించిన ఒలోంగా
- సామాజిక కారణాల కోసం ఇలా పార్ట్ టైమ్ పెయింటర్‌గా మాజీ క్రికెటర్
- 2019లో 'ది వాయిస్ ఆస్ట్రేలియా' పాటల పోటీలో పాల్గొని అప్పట్లో వైరలయిన ఒలోంగా
- తాను ఎప్పుడూ వెరైటీని ఇష్టపడతానన్న ఒలోంగా
- ఒకే పనిని ఎక్కువ కాలం చేయడం తనకు విసుగు తెప్పిస్తుందని వ్యాఖ్య
జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్ హెన్రీ ఒలోంగాను క్రికెట్ అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. ఎందుకంటే మనోడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాధితుడు. 1998లో జరిగిన జింబాబ్వే, శ్రీలంక, భారత్ ట్రై సిరీస్ ఫైనల్‌లో ఒలోంగా బౌలింగ్‌ను సచిన్ ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 92 బంతుల్లోనే 124 రన్స్ చేశాడు. ఇందులో ఎక్కువ పరుగులు ఒలోంగా బౌలింగ్‌లో వచ్చినవే. ఈ మ్యాచ్‌లో మనోడు 6 ఓవర్లు వేసి, ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా అప్పటివరకు స్టార్ పేసర్‌గా ఉన్న ఒలోంగాను సచిన్ ఓ ఆట ఆడుకోవడంతో అభిమానులకు ఈ పేసర్ బాగా గుర్తుండిపోయాడు.
ఇప్పుడు సరిగ్గా పాతికేళ్ల తర్వాత హెన్రీ ఒలోంగా క్రికెట్ గ్రౌండ్‌లో పెయింటింగ్ చేస్తూ కనిపించాడు. అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఇలా ఒలోంగా పెయింటర్‌గా దర్శనమిచ్చాడు. అయితే, అతను సామాజిక కారణాల కోసం ఇలా పార్ట్-టైమ్ పెయింటర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇక 2019లో కూడా ఒలోంగా అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఏకంగా 'ది వాయిస్ ఆస్ట్రేలియా' పాటల పోటీలో పాల్గొని అప్పట్లో వైరల్ అయ్యాడు. అలాగే క్యాజువల్ కోచ్‌గా, అంపైర్‌గా కూడా కనిపించాడు.
ప్రస్తుతం ఒలోంగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్న అతడు, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నట్లు స్పోర్ట్‌స్టార్‌తో అన్నాడు. తనకు ఆస్ట్రేలియా అంటే చాలా ఇష్టమని కూడా చెప్పాడు. తాను ఎప్పుడూ వెరైటీని ఇష్టపడతానన్న ఒలోంగా.. ఒకే పనిని ఎక్కువ కాలం చేయడం తనకు విసుగు తెప్పిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే అప్పడప్పుడు ఇలా కొత్తకొత్త పనులు చేస్తుంటానని తెలిపాడు.
ఒలోంగా చివరిసారిగా 2003తో వన్డే ప్రపంచ కప్‌లో జింబాబ్వే తరపున ఆడాడు. ఆ తర్వాత జింబాబ్వేలో జరిగిన రాజకీయ దురాగతాలపై అతని వైఖరి జట్టు నుంచి వైదొలిగేలా చేసింది. ఇక మనోడికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంటే ప్రత్యేకమైన అభిమానం. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని కూడా కొనియాడాడు. షార్ట్ రన్-అప్‌లో వసీమ్ అక్రమ్‌ను గుర్తు చేస్తాడని ఒలోంగా పేర్కొన్నాడు.