Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పటినుంచంటే..!
- వివరాలు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ
- కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు
- ఆటో డ్రైవర్లు నష్టపోకుండా విధివిధానాల రూపకల్పన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు ట్విట్టర్ లో కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని ట్వీట్ చేశారు.
పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా పథకం విధివిధానాలు రూపొందిస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు.