Kapil dev: గోల్ఫ్‌ ఆదరణకు కృషి చేస్తా... ‘విశ్వ సముద్ర ఓపెన్ ఛాంపియన్‌షిప్’ ట్రోఫీ ఆవిష్కరణలో కపిల్ దేవ్

Kapil dev said he will help to Strengthen Gold In India

  • ప్రముఖ క్రీడాకారులతో కలిసి పాల్గొన్న క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్
  • గోల్ఫ్‌కు ఆదరణ పెంచేందుకు కృషి చేస్తానంటూ వాగ్దానం
  • అనతికాలంలోనే జనాదరణ పొందుతుందని ఆశాభావం 
  • ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘విశ్వ సముద్ర గోల్ఫ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్’
  • పాల్గొననున్న దేశ, విదేశాల ఆటగాళ్లు

భారతదేశంలో గోల్ఫ్‌ క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ కపిల్ దేవ్ చెప్పారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) అధ్యక్షుడిగా తన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ‘విశ్వ సముద్ర గోల్ఫ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్’ ట్రోఫీ ఆవిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ వేదికగా రూ.2 కోట్ల భారీ ప్రైజ్‌మనీతో మంగళవారం నాడు ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ట్రోఫీ ఆవిష్కరణలో పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు.

ఈ సీజన్ కు గాను మొత్తం ప్రైజ్‌మనీ రూ.24.58 కోట్లుగా పీజీటీఐ నిర్ణయించిందని, వచ్చే మూడేళ్లలో రూ.50 కోట్లు అవుతుందన్న నమ్మకం ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. భారతీయ గోల్ఫ్ త్వరలోనే మరో స్థాయికి చేరుతుందని అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 

‘‘నేను ముందుగానే గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టి ఉండాల్సిందని భావిస్తుంటాను. క్రికెట్‌లో కనీసం మరో 2000 పరుగులు చేసి ఉండేవాడిని. బంతిపై ఏకాగ్రత ఎలా ఉండాలో ఈ గేమ్ చాలా నేర్పిస్తుంది. నేను గోల్ఫ్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారతీయ క్రికెటర్లలో ఒక్క రోజర్ బిన్నీ మాత్రమే ఆడేవారు. అంతర్జాతీయంగా చాలా మంది క్రికెటర్లు గోల్ఫ్ ఆడుతుంటారు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. రాబోయే కొన్నేళ్లలో గోల్ఫ్ బాగా జనాదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ‘విశ్వ సముద్ర ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్’ ఈ ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తోంది. ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... గోల్ఫ్‌కు ఆదరణ తీసుకొచ్చేందుకు తమ కంపెనీ గత కొన్నేళ్లుగా కృషి చేస్తోందని ప్రస్తావించారు. పీజీటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషకరమని అన్నారు.

కాగా గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఓం ప్రకాష్ చౌహాన్, ఉదయన్ మానే, వీర్ అహ్లావత్, కరణ్‌దీప్ కొచ్చర్, రాహిల్, గౌరవ్, రషీద్ ఖాన్, ఖలీన్ జోషి, చిక్కరంగప్ప, యువరాజ్ సంధు, ఇతర ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటారు. 

ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్ల విషయానికి వస్తే చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్టెపాన్ డానెక్, కెనడా ప్లేయర్ సుఖ్‌రాజ్ సింగ్ గిల్, జపాన్‌ గోల్ఫ్ ప్లేయర్ మకోటో ఇవాసాకి, ఇంకొందరు అమెరికా ప్లేయర్లతో కలిపి మొత్తం 126 మంది ప్లేయర్లు ఈ గోల్ఫ్ టోర్నీలో ఆడనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌కు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

Kapil dev
Golf
Sports News
Vishwa samudra open champion
  • Loading...

More Telugu News