Manchu Manoj: పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్... మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్సై

Manchu Manoj complainst to police

  • పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్
  • నిన్న తనపై 10 మంది దాడికి యత్నించారని ఫిర్యాదు
  • వారిని పట్టుకునే క్రమంలో తనకు గాయాలయ్యాయని వెల్లడి
  • ఈ ఫిర్యాదులో మోహన్ బాబు పేరు లేదన్న పోలీస్ ఇన్ స్పెక్టర్

ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్, నిన్న ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, మంచు ఫ్యామిలీ ఈ వార్తలను ఖండించింది. కాసేపటికే, మంచు మనోజ్ కాలికి గాయంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రావడంతో, గొడవ జరిగింది నిజమేనన్న వాదనలకు బలం చేకూరింది. 

ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మంచు మనోజ్ నేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు. 

"మంచు మనోజ్ నిన్న తన భార్యా పిల్లలతో ఇంట్లో ఉండగా, పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు పారిపోయారని... ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలాయని మంచు మనోజ్ చెబుతున్నారు. 

ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి లేకుండా చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంచు మనోజ్ మాకు ఫిర్యాదు చేశారు. దీనిపై మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం" అని పోలీస్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు. 

మంచు మనోజ్ తన ఫిర్యాదులో ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు అని మాత్రమే పేర్కొన్నారని పోలీస్ ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు. ఆ కంప్లెయింట్ లో మోహన్ బాబు పేరు గానీ, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు గానీ లేవని తెలిపారు. ఈ దాడి ఎందుకు జరిగిందనేది తనకు తెలియదని మంచు మనోజ్ అంటున్నారని... తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని మాత్రం చెబుతున్నారని ఇన్ స్పెక్టర్ వివరించారు. దర్యాప్తులో ఇతర అంశాలు తెలుస్తాయని అన్నారు. 

డయల్ 100కి కాల్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ నివాసానికి పోలీసులు వెళ్లారని, తాము వెళ్లే సరికి అక్కడ మంచు మనోజ్, ఆయన భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన నిన్న ఉదయం 9 గంటలకు జరిగిందని మనోజ్ చెప్పారని ఇన్ స్పెక్టర్ పేర్కొన్నారు. 

ఇక, సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై దర్యాప్తులో తేలుతుందన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్టు మనోజ్ ఆరోపించారని వివరించారు.

Manchu Manoj
Police
Mohan Babu
Manchu Vishnu
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News