Saydnaya Prision: జైలు కాదది మానవ వధశాల.. సిరియాలోని సేద్నయా జైలులో దారుణాలు.. వీడియో ఇదిగో!

Mass Hangings And Torture That Destroyed Hope In Saydnaya Prision

  • ఒక్క ఫస్ట్ ఫ్లోర్ లోనే 30 వేల మంది ఖైదీలు
  • ఖైదీలందరినీ విడుదల చేసిన తిరుగుబాటుదారులు
  • సేద్నయా ఓ నరక కూపమని చెబుతున్న బాధితులు

సిరియా పాలకులు ఏళ్ల తరబడి సాగించిన దమనకాండ, తమ పాలనను వ్యతిరేకించిన వారిని జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు వందలు, వేలాదిగా బయటపడుతున్నాయి. తిరుగుబాటుదారులు సిరియాను తమ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తో పాటు ఆయన తండ్రి పాలనలో జరిగిన ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిరియాలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను తిరుగుబాటుదారులు విడుదల చేశారు. సేద్నయా జైలులో కేవలం ఒక్క ఫ్లోర్ లోనే ఏకంగా 30 వేల మంది ఖైదీలను ఉంచారన్న కఠోర వాస్తవం వారు బయటకు వచ్చాకే తెలిసింది. సేద్నయా జైలు కాదని మానవ వధశాల అని బాధితులు చెబుతున్నారు. ఈ జైలులో జరిగిన దారుణాల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ గతంలోనూ పలు సందర్భాలలో వెల్లడించింది.

సేద్నయా జైలు..
ప్రభుత్వంపైనా, అధ్యక్షుడికి వ్యతిరేకంగానూ ఆందోళనలు చేసే వారిని ఈ జైలులో పెట్టేవారు. ఇందులో మూడు బ్లాకులు ఉన్నాయి. రెడ్ బిల్డింగ్, వైట్ బిల్డింగ్ ఇందులో కీలకమైనవి. ఆందోళనకారులను రెడ్ బిల్డింగ్ లో ఉంచేవారు. వైట్ బిల్డింగ్ లో ఇతర ఖైదీలను ఉంచడంతో పాటు ఖైదీలకు ఉరి శిక్ష అమలు చేసే చోటు ఇందులోనే ఉంది. సిరియా వ్యాప్తంగా గత పదేళ్లలో లక్ష మంది ఖైదీలను ఉరితీయగా కేవలం ఒక్క సేద్నయా జైలులోనే 30 వేల మందిని ఉరితీసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఉరి తీశాక ఖైదీ మృతదేహాన్ని పాతిపెట్టడమో, ఖననం చేయడమో చేయకుండా ఓ ప్రత్యేకమైన యంత్రంలో పెట్టి అణచేవారట. ఈ యంత్రం మృతదేహాన్ని పూర్తిగా అణగిపోయి పేపర్ లా మార్చేదని తిరుగుబాటుదారులు చెబుతున్నారు.

తాజాగా సేద్నయా జైలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన తిరుగుబాటుదారులు అందులో జరిగిన ఆకృత్యాలకు సంబంధించిన సాక్ష్యాలను వీడియో తీసి ప్రపంచానికి వెల్లడించారు. ఖైదీలను చిత్రహింసలు చేయడానికి రెడ్ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. ఖైదీలకు మరణశిక్ష అమలుచేసే విధానం కూడా దారుణంగా ఉండేదని ఖైదీలు వెల్లడించారు. ఉరి తీసే రోజు మధ్యాహ్నం పూట ఖైదీలను వేరే జైలుకు మారుస్తున్నామని చెప్పి తీసుకెళ్లేవారట. కళ్లకు గంతలు కట్టి వారిని అదే బిల్డింగ్ లోని అండర్ గ్రౌండ్ కు తీసుకెళ్లవారని, అక్కడ గంటల తరబడి చిత్రహింసలకు గురిచేసి ఆపై వైట్ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి ఉరి తీసేవారని చెప్పారు. జంతువులను వధించేందుకు వధశాలలు ఉన్నట్లే సిరియాలోని సేద్నయా జైలు మానవ వధశాల అని తిరుగుబాటుదారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News