Low Pressure: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... ఏపీకి వర్షసూచన
- తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం
- రాగల 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనం
- మరింత బలపడుతుందున్న ఐఎండీ అమరావతి విభాగం
- రాయలసీమలో రెంద్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఏపీఎస్డీఎంఏ
తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రాష్ట్రానికి వర్ష సూచన చేసింది.
ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. రేపు (డిసెంబరు 9) రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
కాగా, రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి మరింత బలపడుతుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వివరించింది.