Sunil Gavaskar: వినోద్ కాంబ్లీ నా కొడుకులాంటివాడు.. అతడిని ఆదుకుంటాం: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar promises  Vinod Kambli to bring him back on his feet

  • ఇటీవల వరుసగా వైరల్ అయిన వినోద్ కాంబ్లీ వీడియోలు
  • అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాంబ్లీ
  • ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమంలో సచిన్ చేయి పట్టుకుని వదిలేందుకు నిరాకరించిన కాంబ్లీ వీడియో వైరల్
  • గతంలో నడవడానికి కూడా ఇబ్బంది పడిన మాజీ క్రికెటర్
  • అతడిని ఆదుకుంటామన్న దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్
  • 1983 జట్టు కాంబ్లీని ఆదుకుంటుందన్న సునీల్ గవాస్కర్

అనారోగ్యంతోపాటు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న టీమిండియా మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ బాగోగులను 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు చూసుకుంటుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హామీ ఇచ్చాడు. 1983 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల ఇలాంటి హామీనే ఇచ్చాడు. ఇప్పుడు గవాస్కర్ కూడా అటువంటి ప్రకటనే చేశాడు. 

ముంబైలో ఇటీవల సచిన్, వినోద్ కాంబ్లీ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమం నిర్వహించారు. దీనికి సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్య స్నేహితులైన సచిన్, కాంబ్లీ కలుసుకున్న వీడియో వైరల్ అయింది. టెండూల్కర్ చేయి పట్టుకున్న కాంబ్లీ వదిలేందుకు నిరాకరించినట్టుగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, కాంబ్లీ బాలీవుడ్ పాట పాడుతున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాకెక్కింది. అయితే, ప్రసంగంలో మాత్రం కొంత ఇబ్బంది పడడం కనిపించింది. అంతకుముందు ఆగస్టులో వైరల్ అయిన వీడియోలో కాంబ్లీ నడవడానికి కూడా ఇబ్బంది పడడం కనిపించింది. 

ఈ నేపథ్యంలో కాంబ్లీని తన ‘కుమారుడి’గా అభివర్ణించిన గవాస్కర్.. 1983 ప్రపంచకప్ సాధించిన భారత జట్టు సభ్యులందరూ కలిసి కాంబ్లీ బాగోగులు చూసుకుంటారని చెప్పుకొచ్చాడు. ‘‘యువ ఆటగాళ్ల విషయంలో 1983 జట్టు ఆందోళనగా ఉంది. నా వరకు చెప్పాలంటే వారు నా మనవళ్లు, కొడుకుల్లాంటి వారు. దురదృష్టం వెంటాడిన అలాంటి క్రికెటర్ల విషయంలో మేం ఆందోళన చెందుతున్నాం. సాయం అనే పదం నాకు ఇష్టం ఉండదు. 1983 జట్టు కాంబ్లీ బాగోగులు చూసుకోవాలనుకుంటోంది. అతడు తిరిగి నిలబడేలా చేయాలనుకుంటున్నాం’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 

గవాస్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు కామెంట్రీ విధులు నిర్వర్తిస్తున్నాడు. టీమిండియా మాజీ పేసర్ బల్వీందర్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ కాంబ్లీ ఆరోగ్యం విషయంలో కపిల్‌దేవ్ తనతో మాట్లాడాడని, అతడికి సాయం చేస్తానని మాటిచ్చాడని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవాస్కర్ కూడా అలాంటి ప్రకటనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News