Adelaide Test: అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర ఓటమి
- 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
- 19 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు
- రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైన భారత బ్యాటర్లు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 128/5 వద్ద మూడవ రోజు ఆరంభమైంది. కేవలం మరో 47 పరుగులు మాత్రమే జోడించి భారత్ ఆలౌట్ అయింది. కేవలం 18 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. దీంతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా విజయ లక్ష్యం కేవలం 19 పరుగులుగా ఉంది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు మెక్‌స్వీని 10, ఉస్మాన్ ఖవాజా 9 ఛేదించారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది.
రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 42 పరుగులతో నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జైస్వాల్ 24, కేఎల్ రాహుల్ 7, శుభ్‌మాన్ గిల్ 28, విరాట్ కోహ్లీ 11, రిషబ్ పంత్ 28, రోహిత్ శర్మ 6, రవిచంద్రన్ అశ్విన్ 7, హర్షిత్ రానా 0, జస్ప్రీత్ బుమ్రా 2 (నాటౌట్), సిరాజ్ 7 చొప్పున పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్స్ కమ్మిన్స్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. బోలాండ్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. 337 పరుగులు సాధించిన ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 157 రన్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండవ ఇన్నింగ్స్‌లో ఇండియా 175 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియా విజయం లక్ష్యం అతి స్వల్పంగా ఉంది.
కాగా 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి.