Adelaide Test: రోహిత్ శర్మ మళ్లీ ఢమాల్... ఓటమి బాటలో టీమిండియా

Team India on the edge in Adelaide Test

  • అడిలైడ్ టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్
  • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 128 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే అవుట్

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమి బాటలో పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగులు వెనుకబడిన టీమిండియా... ఇవాళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంకా 29 పరుగులు వెనుకబడే ఉంది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 24, కేఎల్ రాహుల్ 7, శుభ్ మాన్ గిల్ 8, విరాట్ కోహ్లీ 11 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. 

రిషబ్ పంత్ 28, నితీశ్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. రేపు మూడో రోజు ఆటలో వీరిద్దరిపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ జోడీ ఏదైనా భారీ భాగస్వామ్యం నమోదు చేస్తే... ఆసీస్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా, మూడో రోజు ఆటలో తొలి సెషన్ లోనే చేతులెత్తేస్తే మాత్రం టీమిండియా ఖాతాలో ఓటమి చేరినట్టే. 

ఇక, టీమిండియా సారథి రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు. రొటీన్ కు భిన్నంగా మిడిలార్డర్ లో వచ్చిన హిట్ మ్యాన్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులకు అవుట్ కాగా... రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగులకే వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఏ దశలోనూ క్రీజులో కుదురుకున్నట్టు కనిపించలేదు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుతోనే సరిపెట్టుకున్నాడు. రోహిత్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులు చేయగా... ఆసీస్ 337 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News