Yanamala: చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ
- కాకినాడ సెజ్ కోసం బీసీ వర్గాలు 10 వేల ఎకరాల భూమి కోల్పోయాయన్న యనమల
- రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎంకు విన్నపం
- బిగ్ షాట్ ల నుంచి బీసీ రైతులు, మత్స్యకారులను రక్షించాలన్న యనమల
కాకినాడ సెజ్ లో మత్స్యకారులు, చిన్న రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొన్న పెద్ద కంపెనీలు లాభపడ్డాయని యనమల అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. తక్కువ ధరకు సెజ్ లో భూమిని కొనుగోలు చేసిన కేవీ రావు... దాన్ని వందల కోట్లకు జీఎంఆర్ సంస్థలకు అమ్మారని చెప్పారు. ఆ తర్వాత జగన్ బినామీ అయిన అరబిందో సంస్ధకు దాదాపు రూ.4 వేల కోట్లకు విక్రయించారని తెలిపారు. రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. కాకినాడ పోర్టు ద్వారా దివీస్ సంస్థ కూడా లబ్ధి పొందిందని చెప్పారు.
సెజ్ కోసం బీసీ వర్గాలు దాదాపు 10 వేల ఎకరాల భూమి కోల్పోయాయని యనమల తెలిపారు. తక్కువ ధరకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలే అని యనమల అన్నారు. రైతులను మోసం చేసిన వారిలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. దీనిపై విచారణ జరిపించి ఆ భూములను అసలు రైతులకు ఇప్పించాలని కోరారు. బిగ్ షాట్ ల నుంచి బీసీ రైతులు, మత్స్యకారులను రక్షించాలని... అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు.