Sabarimala: శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Kerala HC slams Devaswom Board for allowing VIP darshan to actor Dileep at Sabarimala

  • నిన్న వీఐపీ దర్శనం చేసుకున్న నటుడు దిలీప్
  • ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుపై హైకోర్టు ఆగ్రహం
  • భక్తులకు ఇబ్బంది కలగడంపై సుమోటోగా తీసుకొని విచారించిన హైకోర్టు

శబరిమల అయ్యప్పస్వామి వారిని మలయాళ నటుడు దిలీప్ నిన్న దర్శించుకున్నారు. అయితే అతనికి అధికారులు వీఐపీ దర్శనం కల్పించారు. నటుడికి వీఐపీ దర్శనం కల్పించడంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మీద కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటుడు దిలీప్ కుమార్ వీఐపీ దర్శనం చేసుకున్న సమయంలో చాలామంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. కొంతమంది భక్తులు అయ్యప్పస్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఈ మేరకు స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. 

మీడియాలో వచ్చిన వార్తలను కేరళ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారించింది. నటుడు దిలీప్‌కు విఐపీ దర్శనం కల్పించడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా, నటుడు చాలాసేపు ఆలయంలో ఉండటానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఆయన కారణంగా పిల్లలు, వృద్ధులు సహా ఎంతోమంది భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవస్థానం బోర్డే ఇలా చేస్తే ఇక భక్తులు ఎవరికి ఫిర్యాదు చేస్తారని మండిపడింది.

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇతరులకు ప్రత్యేక దర్శనం అంటే నిబంధనలకు విరుద్ధమే అని తెలిపింది. శనివారం లోగా పోలీసులు దర్యాఫ్తు చేసి... ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News