Coffee: రెండేళ్ల అధిక ఆయుర్దాయంతోపాటు కాఫీతో ఇన్ని ప్రయోజనాలా?

Drinking Coffee May Boost Lifespan By Nearly 2 Years

  • పోర్చుగల్ యూనివర్సిటీ అధ్యయనంలో నమ్మశక్యం కాని వివరాలు వెల్లడి
  • ఆరోగ్యకరమైన రెండేళ్ల అదనపు జీవితకాలాన్ని జోడించనున్న కాఫీ
  • ఆరోగ్యకరమైన, సమతుల జీవన శైలిలో కాఫీది ముఖ్య భూమిక
  • కాఫీలో 2 వేలకు పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు
  • ఇన్సులిన్‌ను కూడా క్రమబద్ధీకరించనున్న కాఫీ

కాఫీ తాగడం ద్వారా ఆయుర్దాయానికి మరో రెండేళ్లు అదనంగా జోడించవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. గతంలో ప్రచురితమైన అధ్యయనాన్ని సమీక్షించిన అనంతరం ఈ విషయం చెప్పింది. కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ఈ అధ్యయన వివరాలు ‘ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.

కాఫీ తాగడం వల్ల ఒకరి జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో 1.8 సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు. ఆరోగ్యకరమైన, సమతుల జీవనశైలిలో కాఫీ ముఖ్యభూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధాప్యం చెందుతోందని, ఈ నేపథ్యంలో ప్రజలు దీర్ఘకాలం జీవించడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కోయింబ్రా యూనివర్సిటీ ముఖ్య పరిశోధకుడు రోడ్రిగో చుంచా తెలిపారు.

హృద్రోగం, దీర్ఘకాల వ్యాధులు వంటి వివిధ కారణాలతో మరణించే ముప్పును కాఫీ తగ్గిస్తుందని విస్తృతంగా జరిగిన పరిశోధనలో తేలినట్టు చెప్పారు. కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లమేటరీ ప్రయోజనాలు సహా 2,000కుపైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరిస్తుందని పేర్కొన్నారు. 

More Telugu News