Salt: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది?

What happens when we intake more salt

  • అధిక ఉప్పు వాడకంతో జీర్ణ కోశ గోడల లైనింగ్ కు ముప్పు
  • త్వరగా ఉదర కోశ క్యాన్సర్ సోకుతుందన్న నిపుణులు
  • అధిక ఉప్పు వాడకం తగ్గించాలని సూచన

ఏదైనా కూరలు రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. అలాగని ఉప్పు మితిమీరి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. సాధారణంగా, ఉప్పు ఎక్కువగా తింటే అధిక రక్తపోటు (హై బీపీ) వస్తుందని చెబుతారు. కాగా, పరిశోధకులు తాజాగా ఆసక్తికర అంశం వెల్లడించారు. అధిక ఉప్పు వాడకం వల్ల ఉదరకోశ క్యాన్సర్ వస్తుందట. ఉదరకోశ క్యాన్సర్ కు, ఉప్పుకు సంబంధం ఉందని పరిశోధనల్లో తెలిసింది. 

తాజా అధ్యయనం ప్రకారం... ఉప్పు ఎక్కువగా తినడం వల్ల నష్టాలను 8 పాయింట్లలో వివరించారు. 

1. సాధారణంగా పొట్టలోని సున్నితమైన గోడలను మ్యూకస్ (జిగురు) పొరలు కాపాడుతుంటాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ జిగురు లైనింగ్ దెబ్బతింటుంది. ఇది క్రమంగా ఇన్ ఫ్లమేషన్ కు దారితీసి, కణజాలాన్ని ధ్వంసం చేస్తుంది. తద్వారా ఉదర క్యాన్సర్ ముప్పు పెంచుతుంది.

2. మనిషి ఆరోగ్యానికి విపరీతమైన నష్టం కలుగుజేసే బ్యాక్టీరియా... హెలికోబాక్టర్ పైలోరి. అధిక ఉప్పు వాడకం వల్ల ఈ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా కారణంగా కడుపులో అల్సర్లు వృద్ధి చెందుతాయి... ఇది క్రమంగా క్యాన్సర్ కు దారితీస్తుంది.

3. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్ధాల్లో నైట్రేట్లు, నైట్రైట్లు కూడా ఉంటాయి. అయితే ఇవి జీర్ణాశయంలోని యాసిడ్ తో కలిసి కార్సినోజెనిక్ సమ్మేళనాలుగా మారతాయి. ఇది కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.

4. ఉప్పు అధిక వాడకం వల్ల జీర్ణాశయ గోడల లైనింగ్ ను కాపాడే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో ఉదర ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.

5. మితిమీరిన ఉప్పు తింటే కడుపులో విశృంఖల కణజాలం పెరిగిపోతుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించి, ఏకంగా డీఎన్ఏ విధ్వంసానికి కారణమవుతుంది. తద్వారా క్యాన్సర్ కారక జన్యుఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటాయి. 

6. అధిక ఉప్పుతో పేగుల్లో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. దాంతో, ఉదర కోశ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. త్వరగా క్యాన్సర్ బారినపడేందుకు కారణమవుతుంది.

7. ఉప్పగా ఉండే చిరుతిండ్లు, పచ్చళ్లు, నిల్వ ఉంచిన చేపలు ఏళ్ల తరబడి తినడం వల్ల ఉదరకోశం శక్తిని కోల్పోయి క్యాన్సర్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

8. ముఖ్యంగా... కుటుంబంలో ఎవరికైనా ఉదరకోశ క్యాన్సర్ ఉన్నా, జీర్ణాశయ, పేగులకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే వారు ఉన్నా... అలాంటి కుటుంబంలో ఉండేవారు ఉప్పు ఎక్కువగా తింటే త్వరగా కాన్సర్ ముప్పుకు గురవుతారు. 

అందుకే వైద్య నిపుణులు అధిక ఉప్పు వాడకం తగ్గించాలని, నిల్వ ఉంచిన ఆహారాలు కాకుండా, తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫలాలు, కాయగూరలు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు, జీర్ణ కోశ గోడల లైనింగ్ ను పదిలంగా కాపాడుకోవాలంటే తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరమేనట.

  • Loading...

More Telugu News