MS Dhoni: యాడ్స్ లో ధోని హవా... బాలీవుడ్ స్టార్లకు మించి క్రేజ్
- 42 బ్రాండ్లకు ప్రచారకర్తగా మిస్టర్ కూల్
- వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోనీ చేతికి మరిన్ని బ్రాండ్లు!
- బిగ్ బీ 41, షారుక్ ఖాన్ 34, కోహ్లీ చేతిలో 21 బ్రాండ్లు
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి యాడ్స్ లో విపరీతమైన క్రేజ్ ఉందని టామ్ మీడియా రీసెర్చ్ లో వెల్లడైంది. బాలీవుడ్ స్టార్లకన్నా ఎక్కువ బ్రాండ్లకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏడాది పొడవునా సినిమాలు, టీవీ కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉండే సెలబ్రిటీలకన్నా రెండు నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడే ధోనీతోనే తమ బ్రాండ్లకు ప్రచారం చేయించుకోవడానికి కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయట.
టామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం... ధోనీ ప్రస్తుతం 42 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ లో కనిపిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 41 బ్రాండ్లకు, షారుక్ ఖాన్ 34, అక్షయ్ కుమార్ 28, సౌరభ్ గంగూలీ 24, విరాట్ కోహ్లీ 21, రణ్‌వీర్ సింగ్ 21 బ్రాండ్ లకు ప్రచారం చేస్తున్నారు.
ఐదేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ 2024 సంవత్సరం తొలి అర్ధభాగంలో భారీ సంఖ్యలో యాడ్స్‌తో మెరిశాడు. ధోనీ కనిపించే యాడ్స్ లలో సిట్రాన్, డ్రోన్ స్టార్టప్ గరుడ ఎయిరోస్పేస్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్‌ట్రిప్, పెప్సీ కో, ఈమోటోరాడ్, మాస్టర్ కార్డ్, గల్ఫ్‌ఆయిల్, ఓరియంట్ ఎలక్ట్రిక్ తదితర కంపెనీలు ఉన్నాయి. దీంతో పాటు ఝార్ఖండ్ ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటు హక్కు విలువను తెలిపే యాడ్ లోనూ ధోనీ కనిపించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సందర్భంగా ధోనీ బ్రాండ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.