Pushpa 2 Review: 'పుష్ప2'కి సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇదే

Wildfire entertainer and Reserve all the awards says Tarun Adarsh on Pushpa 2 The Rule

  • 4.5/5 రేటింగ్ ఇచ్చిన మూవీ క్రిటిక్
  • మెగా-బ్లాక్ బస్టర్ అని తేల్చేసిన తరణ్ ఆదర్శ్
  • అల్లు అర్జున్‌కు అన్ని అవార్డులు రిజర్వ్ అయినట్టేనంటూ పొగడ్తలు

అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన ‘పుష్ప2’ ఎన్నో అంచనాల మధ్య ఇవాళ (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదలైంది. నిజానికి బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన బాలీవుడ్ మూవీ క్రిటిక్, బిజినెస్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. రేటింగ్ 4.5/5 పాయింట్లు ఇచ్చారు. వన్ వర్డ్ రివ్యూ: మెగా-బ్లాక్‌బస్టర్ అంటూ ఆయన ఎక్స్ వేదికగా తన రివ్యూని షేర్ చేశారు.

పుష్ప2 వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్ అని, అన్ని విధాలా బాగుందని ప్రశంసల జల్లు కురిపించారు. హీరో అల్లు అర్జున్‌ అద్భుతానికి మించి నటించాడని, అన్ని అవార్డులు అతడికి రిజర్వ్ అయినట్టేనని అభిప్రాయపడ్డారు. ఇక దర్శకుడు సుకుమార్ మాయాజాలం చేశాడని, బాక్సాఫీస్ తుపాను వచ్చేసిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. పుష్ప2పై భారీ అంచనాలు ఉన్నాయనే విషయం సుకుమార్‌కు బాగా తెలుసునని, ఊహించని మలుపులతో నిండిన కథనంతో సినిమాను చిత్రీకరించారని మెచ్చుకున్నారు. అదిరిపోయే రేంజ్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లు, కొరియోగ్రాఫీ, డైలాగ్‌లు, ఇలా అన్నీ బావున్నాయని తరణ్ తెలిపారు. పుష్ప తొలి భాగంలో మాదిరిగానే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయని చెప్పారు.

ఇక సినిమా చూసిన తర్వాత రన్‌టైమ్‌పై (3.20 గంటలు) మాట్లాడాల్సిన అవసరం లేదని తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించారు. సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదని, ఎడిటర్ నవీన్ నూలీ బాగా ఎడిటింగ్ చేశారని మెచ్చుకున్నారు. సంగీతం విషయానికి వస్తే దేవీశ్రీ ప్రసాద్ అదరగొట్టాడని పొగిడారు. వినగానే ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్‌ను అందించారని ప్రశంసించారు. పుష్ప2 సినిమా భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా అల్లు అర్జున్‌ స్థాయిని సుస్థిరం చేసిందని వ్యాఖ్యానించారు. ట్రేడ్‌మార్క్ నటన, డైలాగ్ డెలివరీ నిజంగా అద్భుతమని పొగడ్తల జల్లు కురిపించారు. కఠినమైన పోలీసు అధికారి పాత్రలో ఫహద్ ఫాసిల్ నటన అద్భుతమని, మంచి అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడని అన్నారు. ఇద్దరు కీలకమైన పురుష నటులు ఉన్నప్పటికీ.. హీరోయిన్ రష్మిక మందన్న కీలక సన్నివేశాల్లో తన ప్రభావాన్ని చూపించారని తరణ్ మెచ్చుకున్నారు. 'చివరి మాట.. మిస్ కాకుండా చూసే సినిమా ఇది' అంటూ రివ్యూ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News