Zepto: తనకు వ్యతిరేకంగా వైరల్ అవుతున్న పోస్టుపై జెప్టో సీఈవో స్పందన
- జెప్టో సీఈవో అర్ధరాత్రులు మీటింగ్ లు పెడతారంటూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్
- జెప్టోలో వారానికి 10 మంది ఉద్యోగాలు వదిలేస్తుంటారని వ్యాఖ్య
- తాను వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకం కాదన్న జెప్టో సీఈవో
క్విక్ కామర్స్ సంస్థ జెప్టోపై సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. జెప్టో సీఈవో ఆదిత్ పలిచా అర్ధరాత్రులు మీటింగ్ లు పెడుతుంటారని... వారానికి సగటున 10 మంది అక్కడ ఉద్యోగాలను వదిలేస్తుంటారనేది ఆ పోస్ట్ సారాశం. రెడిట్ యూజర్ ఈ పోస్ట్ చేశారు.
జెప్టోలో తాను ఏడాది పాటు పని చేశానని ఆయన తెలిపారు. కంపెనీ సీఈవో ఆదిత్ పలిచా ఉదయం ఆలస్యంగా లేస్తారని... మధ్యాహ్నం 2 గంటల తర్వాతే పని మొదలు పెడతారని ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటలకు మీటింగ్ లు పెడుతుంటారని... ఏ మీటింగ్ కూడా సకాలంలో జరగదని, కొన్నిసార్లు వాయిదా పడుతుంటాయని చెప్పారు.
జెప్టోలో రోజుకు 14 గంటల సేపు పని చేయించుకుంటారని తెలిపారు. యువకులనే ఉద్యోగాల్లో చేర్చుకుంటుంటారని... వయసులో పెద్దవాళ్లు అక్కడ పని చేయలేరని చెప్పారు. జెప్టోపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని... అయితే అవి బయటకు రాకుండా జగ్రత్తపడుతుంటారని విమర్శించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో జెప్టో సీఈవో ఆదిత్ స్పందించారు.
తాను వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకం కాదని ఆదిత్ చెప్పారు. తన పోటీదారులకు కూడా తాను ఇదే చెపుతుంటానని తెలిపారు. భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో దక్ష్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను ఇదే విషయాన్ని వెల్లడించానని చెప్పారు.