Revanth Reddy: కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ: రేవంత్ రెడ్డి

Revanth Reddy praises Konijeti Rosaiah

  • రోశయ్య సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందన్న సీఎం
  • వైరి పక్షాలను ఇరుకున పెట్టే విధానాన్ని రోశయ్య నుంచి నేర్చుకోవాలన్న సీఎం
  • నెంబర్ 1గా ఎంతమంది మారినా నెంబర్ 2 మాత్రం రోశయ్యే ఉండేవారన్న రేవంత్ రెడ్డి

దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని ఆయన ఎప్పుడూ చెప్పేవారన్నారు. రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఆవిష్కృతమైందన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోశయ్య తనను ఛాంబర్‌కు పిలిపించుకొని ఎన్నో విలువైన సూచనలు చేశారన్నారు. బాగా మాట్లాడుతున్నానంటూ తనపై ప్రశంసలు కురిపించడంతో పాటు మరింత అధ్యయనం చేసి శాసనసభకు రావాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు గవర్నర్‌గా అద్భుతంగా పని చేశారన్నారు. పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాన్ని.. ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీని, సీఎంను ఇరుకున పెట్టే విధానాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలన్నారు.

అప్పుడు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా.. నెంబర్ 2 పొజిషన్ మాత్రం రోశయ్యదే అని గుర్తు చేశారు. నెంబర్ వన్‌లో ఉన్న సీఎం మాత్రమే మారుతుండేవారన్నారు. మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి... ఇలా ఎందరో సీఎంల వద్ద నెంబర్ 2గా ఉన్నారన్నారు. వీరంతా ప్రభుత్వాన్ని ప్రశాంతంగా నడిపించడానికి కారణం రోశయ్యే అన్నారు.

సీఎం కావాలని రోశయ్య ఎప్పుడూ కోరుకోలేదని, కానీ సమయం వచ్చినప్పుడు సోనియాగాంధీ ఆయనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తనకు పదవులు కావాలని ఏనాడూ అధిష్ఠానాన్ని కోరలేదు. కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోశయ్యకు సీఎం పదవి అప్పజెప్పారంటే ఆయన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం ఎలాంటిదో తెలిసిపోతోందన్నారు. రోశయ్య హోదాను కోరుకోలేదు... వాటంతట అవే వచ్చాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్యవైశ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. వారి వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలోనూ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో రోశయ్యకు విగ్రహం లేకపోవడం పెద్ద లోటు అన్నారు. ఆర్యవైశ్యులు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేస్తే ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే వర్ధంతి నాటికి దానిని పూర్తి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News