Margani Bharat: దుస్తులు ఊడదీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోబెట్టారు: మార్గాని భరత్
- వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న భరత్
- దళిత యువకుడిపై అక్రమ కేసు పెట్టి హింసించారని మండిపాటు
- ఎమ్మెల్యే వాసు ప్రోద్బలంతోనే హింసించారని ఆరోపణ
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. అక్రమ కేసులతో అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా? అని అడిగారు. దళిత యువకుడిపై అక్రమ కేసు పెట్టి హింసించారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని భరత్ అన్నారు. దళిత యువకుడిని బాజీలాల్ అనే సీఐ దారుణంగా కొట్టారని... దుస్తులు ఊడదీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోబెట్టారని మండిపడ్డారు. పరువుపోయిందని బాధితుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే దళిత యువకుడిని హింసించారని ఆరోపించారు.