Maharashtra: మహా సీఎంపై వీడిన సస్పెన్స్.. ఫడ్నవీసే సీఎం

Maharastra New CM Devendra Fadnavis

  • బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ఎన్నిక
  • రేపు ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం
  • అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడిపోయింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈమేరకు బుధవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. గురువారం ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్) పార్టీలు మహాయుతి కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. కూటమికి మొత్తం 233 సీట్లు దక్కగా.. అందులో బీజేపీ సింగిల్ గానే 132 సీట్లు గెలుచుకుంది. దీంతో మరోసారి సీఎం పదవిని చేపట్టాలని ఏక్ నాథ్ షిండే భావించగా.. కూటమిలో అత్యధిక సీట్లు గెల్చుకున్న తమకే సీఎం సీటు దక్కాలని బీజేపీ పట్టుబట్టింది. సీఎం సీటును ఈసారి వదులుకోబోమని, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ విషయంపై కూటమిలో పలు భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టేందుకు కూటమి పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం.

Maharashtra
Devendra Fadnavis
New CM
Mahayuti
BJP
Eknath Shinde
Ajit Pawar
  • Loading...

More Telugu News