Harbhajan Singh: 10 ఏళ్లుగా ఎంఎస్ ధోనీతో మాట్లాడడం లేదు: హర్భజన్ సింగ్ వెల్లడి
- ధోనీతో సరిగా మాట్లాడక చాలా కాలమైందన్న హర్భజన్ సింగ్
- రెండు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని వెల్లడి
- ధోనీ తనతో మాట్లాడకపోవడానికి కారణం తెలియదన్న భజ్జీ
టీమిండియా మాజీ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్ మధ్య సరైన సంబంధాలు లేవంటూ చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ స్పందించాడు. ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని ధ్రువీకరించాడు. తాను, ధోనీ ఇకపై మాట్లాడుకోమని చెప్పాడు. ధోనీతో తాను సరిగా మాట్లాడి సుమారు 10 ఏళ్లు అవుతుందని భజ్జీ వెల్లడించాడు.
తనతో మాట్లాడకపోవడానికి బహుశా ధోనీకి కారణాలు ఏమైనా ఉండవచ్చని అన్నాడు. అయితే, ధోనీ విషయంలో తనకు అలాంటి పట్టింపులు ఏమీ లేవని అన్నాడు. ‘‘ ధోనీతో నేను మాట్లాడను. నేను చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నప్పుడు ఆటకు సంబంధించి మాత్రమే మాట్లాడుకున్నాం అంతే. ధోనీతో సరిగా మాట్లాడి 10 సంవత్సరాలు పైగానే అవుతోంది. నాకైతే ఎలాంటి కారణం లేదు. బహుశా అతడకి ఉండొచ్చు. ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు. ఐపీఎల్‌లో మేమిద్దరం సీఎస్కేకి ఆడేటప్పుడు మైదానంలో మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. కారణం ఏమిటో తెలియదు గానీ, నేను ధోనీ రూమ్‌కి వెళ్లలేదు. అతడు కూడా నా రూమ్‌కు రాలేదు’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించారు.
ధోనీతో మాట్లాడేందుకు రెండు సార్లు ప్రయత్నించినా ఎలాంటి సమాధానం రాలేదని హర్భజన్ సింగ్ తెలిపారు. అందుకే మరోసారి ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ‘‘అలాగని ధోనీపై నాకేమీ వ్యతిరేకత లేదు. ధోనీ నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఈపాటికే చెప్పి ఉండేవాడు. కానీ చెప్పలేదు. అత్యంత అంకితభావంతో మెలిగే వ్యక్తిగా నేను మళ్లీ కాల్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. అంత టైమ్ కూడా నాకు లేదు. నా కాల్స్ లిఫ్ట్ చేసే వారికి మాత్రమే కాల్స్ చేస్తాను. నాతో స్నేహంగా ఉండేవారికి మాత్రమే నేను సన్నిహితంగా ఉంటాను. నేను కాల్ చేసినప్పుడు స్పందించాలి కదా. ఒకటి రెండుసార్లు కూడా స్పందన రాలేదు. బహుశా నేను కూడా అవసరమైన మేరకు మాత్రమే మిమ్మల్ని కలుస్తాను’’ అని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. ‘క్రికెట్ నెక్స్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తద్వారా ధోనీతో సంబంధాలు సవ్యంగా లేవని నిర్ధారించినట్టు అయింది.
నిజానికి 2018 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. సహచరులుగా ఉన్నప్పటికీ ఇద్దరూ మాట్లాడుకోలేదు. మైదానంలో వారిద్దరి మధ్య సంభాషణలు ఆటకు మాత్రమే పరిమితమై ఉండేవి.