Nitin Gadkari: ఢిల్లీకి రావాలంటేనే విసుగు కలుగుతోంది!: నితిన్ గడ్కరీ
- ఢిల్లీలో నివసించడం ఏమాత్రం ఇష్టం లేదన్న గడ్కరీ
- ఢిల్లీకి వచ్చే ప్రతిసారి రావాలా? వద్దా? అని ఆలోచిస్తుంటానన్న కేంద్రమంత్రి
- శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే మార్గమని వ్యాఖ్య
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యస్థాయి తీవ్రంగా పెరుగుతుండటంతో ఇక్కడకు రావాలంటేనే విసుగు కలుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తనకు ఢిల్లీలో నివసించడం ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు. కాలుష్యం కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకుతుండటంతో తనకు ఢిల్లీకి రావాలనిపించడం లేదన్నారు. ఢిల్లీలో కాలుష్యం బాగా ఉందన్నారు.
తాను ఢిల్లీకి వచ్చే ప్రతిసారీ కాలుష్యం భయంతో వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తుంటానన్నారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే కాలుష్య నివారణకు ఉత్తమ మార్గమన్నారు. మన దేశం ప్రస్తుతం రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందన్నారు.
లక్షల కోట్ల విలువైన దిగుమతుల నేపథ్యంలో ఈ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, జీవావరణంపై పడుతోందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించుకోవచ్చని వ్యాఖ్యానించారు.