Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

Sajjala Bhargava Reddy gets small relief in Supreme Court
  • తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని భార్గవరెడ్డి పిటిషన్
  • హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలన్న సుప్రీంకోర్టు
  • రెండు వారాల వరకు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టీడీపీ, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులను పెట్టిన కేసుల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. 

అయితే ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో పిటిషన్లు వేసుకోవాలని సూచించింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు ఆయనకు రెండు వారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. 

భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, ఏపీ ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పొత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని సిబాల్ అన్నారు. చట్టాలు ఎప్పటివనేది ముఖ్యం కాదని... మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను చూడాలని లూథ్రా చెప్పారు. దర్యాప్తుకు కూడా భార్గవరెడ్డి సహకరించడం లేదని... సుప్రీంకోర్టు ముందు కూడా అనేక విషయాలను గోప్యంగా ఉంచారని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ... అసభ్య వ్యాఖ్యలు చేసే ఎవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించింది.
Sajjala Bhargava Reddy
YSRCP
Supreme Court

More Telugu News