Mehbooba Mufti: ఆ విషయంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య పెద్ద తేడా లేదు: ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు

No Difference In India And Bangladesh Says Mehbooba Mufti
  • మైనారిటీలపై భారత్ లోనూ దాడులు జరుగుతున్నాయని ఆవేదన
  • దేశాన్ని 1947 నాటి కాలానికి నడిపిస్తున్నారంటూ మండిపాటు
  • యువతకు ఉద్యోగాల్లేవు, సరైన రోడ్లు లేవు.. కానీ గుడుల ఆనవాళ్ల కోసం మసీదులను కూల్చుతున్నారని విమర్శ
బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి.. అదేవిధంగా భారత్ లోనూ మైనారిటీలపై దాడులు జరిగితే ఇక ఈ రెండు దేశాల మధ్య తేడా ఏమున్నట్టు? అంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 24న ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలకులు దేశాన్ని 1947 నాటి కాలం వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు, తగినన్ని ఆసుపత్రులు లేవు, సరైన విద్యావకాశాలు లేవని గుర్తుచేశారు.

పాడైపోయిన రోడ్లను బాగుచేయాల్సిన పాలకులు ఆ విషయం పక్కన పెట్టి ఆలయాల ఆనవాళ్ల కోసం మసీదులను కూల్చి ఆ శిథిలాల్లో వెతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంభాల్ తరహాలోనే అజ్మీర్ దర్గాపైనా వివాదం సృష్టించారని, ఆలయ స్థలంలో దర్గాను నిర్మించారని కొంతమంది కోర్టుకెక్కారని చెప్పారు. మతసామరస్యానికి వేదికగా నిలిచే అజ్మీర్ దర్గాలో సర్వే పేరుతో తవ్వకాలకు సిద్ధమవుతున్నారని ముఫ్తీ మండిపడ్డారు. మైనారిటీలపై దాడుల విషయంలో ఇండియాకు, బంగ్లాదేశ్ కు తేడా కనిపించడంలేదని అన్నారు.

ఉత్తరప్రదేశ్ సంభాల్ లోని షాహి జామా మసీద్ ఉన్న స్థలంలో గతంలో ఓ ఆలయం ఉండేదని, దానిని కూల్చేసి మసీదును కట్టారని యూపీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన కోర్టు.. మసీదు స్థలంలో సర్వే చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే చేయడానికి ప్రయత్నించగా స్థానిక ముస్లింలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. దీంతో సంభాల్ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మైనారిటీలపై మన దేశంలోనూ దాడులు జరుగుతున్నాయంటూ ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు.
Mehbooba Mufti
PDP
Minorities
Bangladesh
India
Sambhal
Ajmer Dargha

More Telugu News