Yanamala: జగన్ స్కామ్ ను సాక్షి తప్ప అన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి: యనమల
- అదానీ కంపెనీల నుంచి జగన్ కు ముడుపులు ముట్టాయన్న యనమల
- ఈ విషయాన్ని ఎఫ్బీఐ స్పష్టం చేసిందన్న యనమల
- పత్రికా స్వేచ్ఛకు జగన్ భంగం కలిగిస్తున్నారని విమర్శ
సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అదానీ కంపెనీల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రూ. 1,750 కోట్ల ముడుపులు ముట్టాయని... ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్పష్టం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ లంచం వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నిరాధార వాదనలు చేస్తూ పత్రికా స్వేచ్ఛకు జగన్ భంగం కలిగిస్తున్నారని యనమల విమర్శించారు. జగన్ స్కామ్ ను సాక్షి పత్రిక తప్ప... జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయని చెప్పారు. ప్రపంచమంతా గుర్తించిన నేరాన్ని జగన్ సమర్థించుకుంటున్నారని అన్నారు. జగన్ తప్పు చేయకపోతే... ఎఫ్బీఐ, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఎందుకు దావా వేయడం లేదని ప్రశ్నించారు.