: ఈ శునకరాజం వెరీగుడ్డు...!
ఆసుపత్రుల్లో తల్లులు ఆదమరచి ఉన్న సమయంలో పురిటి బిడ్డలను నోట కరచుకుని వెళ్లి చంపేసే కుక్కలు మనకు ఎల్లెడలా కనిపిస్తుంటాయి. అయితే ఈ శునకరాజం మాత్రం తనకు కనిపించిన ఒక పురిటిబిడ్డను జాగ్రత్తగా తీసుకెళ్లి తన యజమానికి ఇచ్చి, ఆ బిడ్డను కాపాడింది. ఈ మంచి పనికి సదరు శునకానికి మంచి బహుమతి కూడా లభించింది.
థాయ్‌ల్యాండ్‌లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ప్లాస్టిక్ సంచీలో ఒక శిశువును ఉంచి ఒక ఇంటి సమీపంలోని చెత్త కుండీలో పడవేసి వెళ్లారు. ఆ సంచీ ఇంటికి కాపలా కాసే శునకానికి కనిపించింది. వెంటనే ఆ సంచీని తీసుకెళ్లి అది తన యజమానికి అందజేసింది. అంతటితో ఆగకుండా అందులో శిశువు ఉన్నట్టుగా తన అరుపులతో తన యజమానికి తెలియజేసింది. దాని అరుపులను గ్రహించిన యజమాని కవరు తెరచి శిశువును గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించాడు. ఇంతటి మంచి పనిచేసి ఒక శిశువు ప్రాణాన్ని కాపాడిన సదరు శునకాన్ని మెచ్చుకుంటూ ది మిరకిల్ ఆఫ్ లైఫ్ పౌండేషన్‌కు చెందిన ఒకరు రూ.18 వేలు బహుమానంగా ఇచ్చారు. అందుకే మరి ఈ శునకరాజాన్ని వెరీగుడ్డు అందామా...!