Eknath Shinde: మహా సీఎం రేసు నుంచి తప్పుకున్న ఏక్ నాథ్ షిండే!

Eknath Shinde talks about CM chair

  • ఇప్పటికీ తేలని మహా సీఎం పంచాయితీ
  • రేపటితో తెరపడే అవకాశం
  • బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న షిండే
  • ఫడ్నవీస్ కు తొలగిన అడ్డంకి!

మహారాష్ట్ర సీఎం పదవిపై నెలకొన్న ఉత్కంఠ దాదాపు తొలగిపోయినట్టే. తదుపరి ముఖ్యమంత్రి రేసు నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది! బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తానని షిండే స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. ఇటీవల మహాయుతి కూటమి నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేయగా, ఉన్నట్టుండి షిండే అనారోగ్యం పేరిట తన స్వగ్రామం వెళ్లిపోవడంతో ఆ సమావేశం జరగలేదు. దాంతో, సీఎం పదవిపై పీట ముడి పడింది. 

ఇవాళ మీడియాతో మాట్లాడిన షిండే.... సీఎం పదవి అంశంపై స్పందించారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై రేపు (సోమవారం) నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. "నేను ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట జవదాటనని బేషరతుగా మద్దతు ఇచ్చాను. మహారాష్ట్ర కోసం వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపాను" అని షిండే వెల్లడించారు. 

అంతేకాదు, షిండే తన అస్వస్థత గురించి తొలిసారిగా మాట్లాడారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నానని, ప్రస్తుతం తన స్వగ్రామం దరే తాంబ్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. గత రెండున్నరేళ్లుగా విశ్రాంతి తీసుకోకుండా పనిచేశానని, అందుకే ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. సొంతంగా బీజేపీ 132 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. శివసేన (షిండే) 57 స్థానాలతో సరిపెట్టుకుంది. దాంతో, బీజేపీ నేత, గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర తదుపరి సీఎం రేసులో ముందు నిలిచారు. 

ఫడ్నవీస్ నే తదుపరి సీఎం చేయాలన్నది  బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా తెలుస్తోంది. ఇప్పుడు షిండే వ్యాఖ్యలతో ఫడ్నవీస్ కు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్టే భావించాలి. ఏదేమైనా రేపటితో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. 

Eknath Shinde
Devendra Fadnavis
Chief Minister
Maharashtra
  • Loading...

More Telugu News