bee attack: తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సింధియాను తీసుకువెళ్లిన భద్రతా సిబ్బంది
- కేంద్ర మంత్రి పర్యటనను డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరణ చేస్తుండగా కదిలిన తేనెతుట్టె
- తేనె టీగల దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి హజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురిలో శనివారం జరిగింది. శివపురిలోని మాధవ్ నేషనల్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికలో కేంద్ర మంత్రి సింధియా పాల్గొన్నారు.
అయితే కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వీడియో చిత్రీకరణకు డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తేనెటీగలు అక్కడ ఉన్న వారిపై దాడి చేశాయి. భద్రతా సిబ్బంది కేంద్ర మంత్రికి వలయంగా ఏర్పడి ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే తేనె టీగల దాడిలో కొత్వాలీ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.