Eknath Shinde: ఏక్ నాథ్ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు: శివసేన నేత సంజయ్ శిర్సాట్
- షిండే పథకాలు కూటమికి ఓట్లు కురిపించాయన్న సంజయ్
- సాధారణంగా హోం శాఖను డిప్యూటీ సీఎంకు ఇస్తారని వ్యాఖ్య
- శివసేనకు హోం శాఖను ఇవ్వాలన్న సంజయ్
మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. తదుపరి సీఎం, మంత్రుల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. కూటమి ముఖ్య నేతల భేటీని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రద్దు చేసుకోవడం చర్చనీయాంశమయింది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ శిర్సాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త ప్రభుత్వంలో షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ అన్నారు. షిండే నేతృత్వంలో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరిందని చెప్పారు. కొన్ని పథకాలకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ... షిండే వాటిపై ముందుకు వెళ్లారని... ఆ పథకాలన్నీ ఎన్నికల్లో కూటమికి ఓట్లు కురిపించాయని అన్నారు. డిప్యూటీ సీఎంకు హోం శాఖను ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని... అలా కాకుండా హోం శాఖను సీఎం వద్ద ఉంచుకోవడం సరికాదని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో షిండేకు కీలక శాఖలను ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి సీఎం పదవి ఇస్తే... శివసేనకు హోం మంత్రి పదవిని ఇవ్వాలని అన్నారు.