Tirumala: తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించిన టీటీడీ
- తిరుమలలో రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారిన వైనం
- కొండపై రాజకీయ విమర్శలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న టీటీడీ
- ఆలయ పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
తిరుమల శ్రీవారిని దర్శించుకునే రాజకీయ నాయకుల్లో పలువురు కొండపైన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తుండటం అందరికీ తెలిసిందే. కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది.
తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. తాజాగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది.