Cancer: తరచూ ఈ లక్షణాలు కనిపిస్తుంటే... కేన్సర్‌ వ్యాధి కావొచ్చు!

hidden cancer signs you must not ignore

  • తొలుత ఏదో చిన్న ఇబ్బందిలా మొదలయ్యే కేన్సర్
  • చాలా మంది అది గుర్తించకపోవడంతో తీవ్రమవుతున్న వ్యాధి
  • మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తే కేన్సర్ కావొచ్చంటున్న నిపుణులు
  • ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయిస్తే ప్రయోజనం ఉంటుందని వెల్లడి

ప్రపంచాన్ని చాప కింద నీరులా కమ్మేస్తున్న మహమ్మారి కేన్సర్‌ వ్యాధి. రకరకాల కేన్సర్లతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏదో చిన్న సమస్యలా కనిపిస్తూ ఉండటం వల్ల చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కేన్సర్‌ ముదిరిపోయిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. అప్పుడు అత్యంత ఖరీదైన, బాధాకరమైన చికిత్సలు తీసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయోజనం కూడా తక్కువగా ఉంటోంది. జీవితాంతం ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మనలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే... కేన్సర్‌ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుండటం... 
కొందరు ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుంటారు. తగినంత ఆహారం తీసుకున్నా, మధుమేహం వంటి వ్యాధులేమీ లేకున్నా కూడా.. బరువు తగ్గిపోతుంటారు. అలాంటప్పుడు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా బరువు తగ్గడం పాంక్రియాటిక్‌, స్టమక్‌, ఊపిరితిత్తుల కేన్సర్ల లక్షణమని వివరిస్తున్నారు.

మహిళల అవయవాల్లో మార్పులు
మహిళల్లో చనుమొనల పరిమాణం, రంగు వంటివాటిలో ఉన్నట్టుండి, అసాధారణ మార్పులు కనిపిస్తే... అవి రొమ్ము కేన్సర్‌ లక్షణాలు కావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎముకల్లో నొప్పి... 
కీళ్లు, జాయింట్ల వద్ద మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎముకల నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలా తరచూ నొప్పి వస్తుంటే.. ఎముకల కేన్సర్‌ లేదా మెటాస్టాటిక్‌ కేన్సర్‌ కావొచ్చని చెబుతున్నారు.

చర్మంపై దీర్ఘకాలిక రాషెస్‌...
శరీరంలో ఎక్కడైనా చర్మంపై రాషెస్‌ (దద్దుర్లు) ఏర్పడి సుదీర్ఘకాలం తగ్గిపోకుండా ఉండటం చర్మ కేన్సర్‌ లేదా లింఫోమా వంటి తీవ్ర వ్యాధి లక్షణం అయి ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో వీలైనంత త్వరగా టెస్ట్‌ చేయించుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు.

గొంతులో ఒక రకమైన ఇబ్బంది... 
తరచూ గొంతులో ఏదో ఇబ్బందిగా అనిపించడం, ఆహారం మింగడానికి అవస్థ పడుతుండటం వంటివి కూడా కేన్సర్‌ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకునేప్పుడు ధ్వని రావడం, మెలకువలో ఉన్న సమయంలోనూ గురక వంటివి కూడా సమస్యాత్మకమని వివరిస్తున్నారు. ఇవి గొంతు కేన్సర్‌ లేదా ఎసోఫాగల్‌, పొట్ట కేన్సర్‌ కావొచ్చని... తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

పొత్తి కడుపు, జీర్ణ వ్యవస్థలో అసాధారణ మార్పులు
మన ఆహార అలవాట్లలో పెద్దగా మార్పు లేకున్నా కూడా.. తరచూ డయేరియా బారినపడటం, మలబద్ధకంతో బాధపడుతుండటం వంటివి కోలోరెక్టల్‌ కేన్సర్‌ లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి సుదీర్ఘకాలం కొనసాగితే తగిన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏమిటో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

అకస్మాత్తుగా, తరచూ జ్వరం వస్తుండటం 
ఎలాంటి కారణం లేకుండా తరచూ జ్వరం రావడం, మందులు వేసుకున్నా పెద్దగా ఉపశమనం లేకపోవడం, సుదీర్ఘకాలం జ్వరం కొనసాగడం, శరీరం బలహీనమవడం వంటివి ఉంటే... అవి రక్త కేన్సర్‌ (ల్యూకేమియా), లింఫోమా లక్షణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నిరంతరం కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య...
తీవ్ర కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య నిరంతరం వేధిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. అవి మహిళల్లో ఒవేరియన్‌, పురుషుల్లో పెద్ద పేగు కేన్సర్‌ లక్షణాలు కావొచ్చని సూచిస్తున్నారు.

తరచూ తలనొప్పి.. కంటి చూపు తగ్గిపోవడం.. 
తరచూ తలనొప్పి వేధిస్తుండటం, ఉన్నట్టుండి కంటి చూపు తగ్గిపోతుండటం వంటివి బ్రెయిన్‌ కేన్సర్‌ లేదా ఇతర కేన్సర్ల లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుని, వాటికి కారణమేంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News