Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు... వివరాలు ఇవిగో!

allotment of land to various organizations in amaravati

  • వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ 
  • జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు చేపడతామన్న మంత్రి నారాయణ
  • డిసెంబర్ ఆఖరుకల్లా టవర్లు, ట్రంకు రోడ్ల టెండర్లు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ

వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని చెప్పారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. 
 
రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్‌కు 5 ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 15 ఎకరాలు, ఎల్ అండ్ టీ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 
 
బ్రహ్మ కుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉప సంఘం అంగీకారం తెలిపిందన్నారు. 131 మందికి గతంలో భూములు ఇచ్చామని, వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని తెలిపారు. గతంలో భూములు ఇచ్చిన వారికి అప్పటి ధరలకే ఇస్తున్నామని చెప్పారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.  

Amaravati
Ponguru Narayana
capital amaravati
works
  • Loading...

More Telugu News