Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ... ఏక్‌నాథ్ షిండే సొంతూరు వెళ్లడంతో సమావేశం రద్దు

Twist in Maharashtra story as Eknath Shinde decamps

  • నిన్న అమిత్ షాతో భేటీ అయిన మహాయుతి కూటమి నేతలు
  • నేడు సమావేశమై ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామన్న నేతలు
  • అనూహ్యంగా తన సొంతూరుకు వెళ్లిన ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. దీంతో ఈరోజు జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం రద్దైంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని భావించారు. కానీ ఆపద్ధర్మ సీఎం అందుబాటులో లేకపోవడంతో భేటీ రద్దై... ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షాతో సానుకూల చర్చలు జరిగాయని, ముంబైలో మరోసారి సమావేశమై చర్చిస్తామని, ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఏక్‌నాథ్ షిండే నిన్న తెలిపారు.

అమిత్ షాతో నిన్నటి భేటీ, సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం విషయమై ఈ రోజు మహాయుతి నేతలు భేటీ కావాల్సి ఉంది. కానీ షిండే లేకపోవడంతో రద్దైనట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన తన గ్రామం నుంచి తిరిగి వచ్చాక సమావేశం జరగవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News