Health: బాగా తిన్నా నీరసమా..? ఈ లోపమే కారణం కావొచ్చు!
- శరీరానికి నిత్యం అందాల్సిన అత్యవసర పోషకాల్లో ‘విటమిన్ సీ’ ఒకటి
- చర్మం ఆరోగ్యం నుంచి గుండె పనితీరుదాకా ఇది ఎంతో కీలకం
- కొన్ని లక్షణాల ఆధారంగా ‘విటమిన్ సీ’ లోపాన్ని గుర్తించవచ్చంటున్న నిపుణులు
మన శరీరానికి అందాల్సిన అత్యవసర పోషకాల్లో ‘విటమిన్ సీ’ మరింత కీలకమైనది. ఇది సరిగా అందకపోతే శరీరం బలహీనమైపోతుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన చర్మం నుంచి గుండె దాకా అవయవాల పనితీరు దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. శరీరంలో కనిపించే కొన్ని రకాల లక్షణాల ఆధారంగా... ‘విటమిన్ సీ’ లోపం ఉన్నట్టుగా గుర్తించవచ్చని వివరిస్తున్నారు.
కండరాల బలహీనత, నొప్పి
శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి కోసం విటమిన్ సీ అత్యంత ఆవశ్యకం. కొల్లాజెన్‌తోనే కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం దృఢంగా ఉంటుంది. లేకపోతే కండరాలు బలహీనమై, నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలుంటే విటమిన్ సీ లోపంతో బాధపడుతున్నట్టే.
బలహీనమైన ఎముకలు
శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి ‘విటమిన్ సీ’ తగినంత అందాల్సిందే. ఎముకలు తయారయ్యే క్యాల్షియంను శరీరం సరిగా సంగ్రహించేందుకు విటమిన్ సీ తోడ్పడుతుంది. దీని లోపం వల్ల శరీరం సరిగా క్యాల్షియంను శోషించుకోలేక.. ఎముకలు బలహీనమై ‘ఆస్టియో పోరోసిస్’ సమస్య తలెత్తుతుంది.
ఐరన్ లోపం.. రక్త హీనత
మన శరీరం ఐరన్ ను సరిగా సంగ్రహించాలంటే కూడా విటమిన్ సీ తప్పనిసరి. తగినంత విటమిన్ సీ లేకుంటే ఐరన్ సరిగా అందక.. రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రక్త నాళాల బలహీనత
‘విటమిన్ సీ’ లోపం వల్ల శరీరంలో కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాదు. దీనితో రక్త నాళాల గోడలు బలహీనమై... చిన్న ఒత్తిడికే దెబ్బతింటూ ఉంటాయి. ఏదైనా చర్మంపై కాస్త గీరుకుపోయినా గాయం ఎక్కువగా అవుతూ ఉంటుంది.
పెళుసుబారిన గోర్లు, వెంట్రుకలు
మన గోర్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండటానికి ‘విటమిన్ సీ’ అవసరం. శరీరంలో ‘విటమిన్ సీ’ లోపం ఉంటే... గోర్లు పెళుసుబారిపోతాయి. వెంట్రుకలు కళావిహీనమై, సులువుగా తెగిపోతుంటాయి.
చిగుళ్లు దెబ్బతిని రక్తం కారడం
‘విటమిన్ సీ’ లోపం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. చిన్నపాటి కదలిక, కాస్త గట్టిగా బ్రషింగ్ చేసినా చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తరచూ ఇలా జరుగుతున్నట్టయితే ‘విటమిన్ సీ’ లోపంగా అనుమానించాల్సిందే.
రోగ నిరోధక వ్యవస్థకు దెబ్బ
శరీరంలో విటమిన్ సీ లోపం ఉంటే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. సీజనల్ వ్యాధులకు చాలా సులువుగా లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ వేధిస్తుంటాయి. న్యుమోనియా సమస్య ఉన్నవారికి ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది.
కంటి చూపు దెబ్బతినడం
శరీరానికి విటమిన్ సీ సరిగా అందకుంటే... వయసు మీదపడటం వల్ల వచ్చే లక్షణాలు మరింత వేగవంతం అవుతాయి. ఈ క్రమంలో కంటిచూపు వేగంగా తగ్గిపోతుంటుంది.
బలహీనత, మూడ్ స్వింగ్
శరీరంలో శక్తి ఉత్పత్తయ్యే ప్రక్రియలో ‘విటమిన్ సీ’ కూడా పాలు పంచుకుంటుంది. దీని లోపం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతింటుంది. అందువల్ల తగినంత ఆహారం తీసుకుంటున్నా కూడా శరీరం బలహీనంగా ఉన్న భావన కలుగుతుంది. ఇక శరీరంలో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉత్పత్తిలోనూ విటమిన్ సీ పాత్ర ఉంటుంది. దీనిలోపం వల్ల ఆ వ్యవస్థ దెబ్బతిని ‘మూడ్ స్వింగ్స్’ సమస్య వస్తుంది. మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.