Satya Kumar: ఓడించినందుకు ప్రజల్ని నిందించడం జగన్ ఇంకా మానుకోలేదు: మంత్రి సత్యకుమార్

Minister SatyaKumar takes on YS Jagan

  • జగన్‌లో అధికారం లేదన్న నిరాశ, నిస్పృహ కనిపిస్తోందన్న మంత్రి
  • ఆరోగ్య రంగంలో 52 వేలమందిని రిక్రూట్ చేశామని అబద్ధం చెప్పారన్న మంత్రి
  • నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెబుతానని సవాల్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినందుకు వారిని నిందించడం ఇంకా జగన్ మానుకోలేదని ఏపీ మంత్రి సత్య కుమార్ విమర్శించారు. తనకు అధికారం లేదన్న నిరాశ, నిస్పృహ జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్య రంగంలో 52 వేల మందిని రిక్రూట్ చేసినట్లు జగన్ చెప్పారని, కానీ అది పచ్చి అబద్ధమన్నారు. అది నిజమని నిరూపిస్తే తాను జగన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెబుతానని సవాల్ చేశారు.

సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత రాష్ట్రంలో నాలుగు శాతంగా ఉందని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాం నుంచే ఈ కొరత 59 శాతంగా ఉందన్నారు. నేటి ఆయన ప్రెస్ మీట్‌లో అధికారం లేదనే నిరాశ ఆయనలో కనిపించిందన్నారు. అధికారానికి దూరమైన ఈ ఐదు నెలల్లో జగన్ దాదాపు డజనుసార్లు మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. ప్రతిసారి తానేదో అద్భుతాలు చేసినట్లు చెప్పారని, అయినప్పటికీ ప్రజలు తనను ఓడించారనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలిపారు.

ఈరోజు ప్రెస్ మీట్‌లో ఆయన సంపద సృష్టి చేసినట్లు చెప్పారని, కానీ ప్రజాధనంతో ఒక ముఖ్యమంత్రి ఆస్తులను ఎలా పెంచుకోవచ్చునో చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తాను ఈరోజు వైద్య విద్య అంశంపై సమీక్ష నిర్వహించానని, 17 ప్రభుత్వ కాలేజీల్లో 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉందన్నారు. జగన్ నిత్యం ప్రజలను నిందించడానికి బదులు తన అసహనాన్ని, నిరాశను అధిగమించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News