HomeGuard: సీఎం విగ్రహం పెట్టి ఉద్యోగం కోసం మాజీ హోంగార్డ్ శాంతి దీక్ష
- హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్
- రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి
- బెల్లంపల్లిలో తన నివాసంలో దీక్ష చేపట్టిన మాజీ హోంగార్డ్
అన్యాయంగా తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మాజీ హోంగార్డ్ వినూత్న దీక్ష చేపట్టాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకుని, దాని ముందు దీక్షకు కూర్చున్నాడు. బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో సకినాల నారాయణ ఉంటున్నాడు. మాజీ హోంగార్డ్ అయిన నారాయణ.. అన్యాయంగా తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని వాపోతున్నాడు. హోంగార్డుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరాలని తాను శాంతి దీక్ష చేపట్టానని చెప్పాడు.
విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై మహేందర్ తో నారాయణ మాట్లాడాడు. హోంగార్డులకు సంబంధించి తన డిమాండ్లను వెల్లడించాడు. హోంగార్డులను పర్మనెంట్ చేయాలని, చనిపోయిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరాడు. వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే రిటైర్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ తన దీక్ష కొనసాగుతుందని నారాయణ స్పష్టం చేశాడు.