Glenn Maxwell: జైస్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు చేస్తాడు.. మ్యాక్స్‌వెల్ జోస్యం!
- పెర్త్‌లో భారీ సెంచరీ (161)తో ఆకట్టుకున్న యువ బ్యాటింగ్ సంచలనం
- భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్
- ఈ విషయాన్ని గుర్తు చేస్తూ భారత ఆటగాడిపై మ్యాక్స్‌వెల్ ప్రశంసలు
- 2024లో అత్యధిక పరుగులు (1,280) చేసిన రెండో ప్లేయర్‌గా జైస్వాల్
భారత యువ బ్యాటింగ్ సంచలనం యశస్వి జైస్వాల్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. ఈ యువ ఆటగాడు తన కెరీర్‌లో 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మ్యాక్స్‌వెల్ జోస్యం చెప్పాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ భారీ సెంచరీ (161)తో చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత తనదైనశైలిలో అద్భుతమైన షాట్‌లతో అలరించాడని, అతని అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో ఆస్ట్రేలియన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకునే జైస్వాల్ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. అతని వద్ద టాలెంట్‌కు కొదవలేదని తన కెరీర్‌లో కచ్చితంగా 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ చెప్పుకొచ్చాడు.
"అతను (జైస్వాల్) బహుశా 40కి పైగా టెస్టు సెంచరీలు సాధించి, కొన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పడం ఖాయం. విభిన్న పరిస్థితులకు తగ్గట్టు అతను గొప్ప బ్యాటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. జైస్వాల్‌ను ఆపడానికి ఆస్ట్రేలియా సరైన మార్గాన్ని కనుగొనలేకపోతే అతడు మునుముందు ఇంకా భయానకంగా మారే అవకాశం ఉంది" అని 'ది గ్రేడ్ క్రికెటర్' పోడ్‌కాస్ట్‌లో మ్యాక్స్‌వెల్ అన్నాడు.
మ్యాక్స్‌వెల్ ఇంకా మాట్లాడుతూ.. "అతను చాలా షాట్‌లు ఆడాడు. అవి చాలా హైలైట్ ప్యాకేజీలలో ఉంటాయి. అతని ఫుట్‌వర్క్ చాలా బాగుంది. కానీ మనకు చూడడానికి అలా అనిపించదు. షార్ట్ బాల్‌ను బాగా ఆడుతాడు. బాగా డ్రైవ్ చేస్తాడు. ఇక స్పిన్ బౌలింగ్‌ను కూడా అంతే బాగా ఆడతాడు. ఒత్తిడిని తట్టుకుని క్రీజులో పాతుకుపోయి, పరిస్థితులకు అనుగుణంగా భారీ షార్ట్స్ ఆడగలడు” అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.
ఇక జైస్వాల్ ఇప్పటివరకు 15 టెస్టు మ్యాచుల్లో 58.07 సగటుతో 1,568 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది 12 మ్యాచులు ఆడిన 22 ఏళ్ల జైస్వాల్ 58.18 సగటుతో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలతో 1,280 రన్స్ చేశాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున, తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే ఈ యువ ఆటగాడి బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు రావడం ఖాయం. ఇక బీజీటీలో భాగంగా పెర్త్‌లో 295 పరుగుల భారీ విజయంతో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది.