Chandrababu: విశాఖ ఠాగూర్ ల్యాబ్స్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
- విశాఖ ఠాగూర్ ఫార్మా ల్యాబ్స్ పరిశ్రమలో విషవాయువులు లీక్
- ఒడిశాకు చెందిన కార్మికుడి మృతి
- బాధితులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించిన సీఎం
విశాఖ పరవాడలోని ఠాగూర్ ఫార్మా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో విష వాయువులు లీకైన ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉండాలని సూచించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఠాగూర్ ల్యాబ్స్ లో విషవాయువులు లీకైన ఘటనలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒడిశాకు చెందిన అమిత్ (23) అనే కార్మికుడు మృతి చెందాడు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. ఇద్దరు కార్మికులకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించాలని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ను ఆదేశించామని చెప్పారు. ప్రమాద స్థలంలో సీసీ టీవీ ఫుటేజి సేకరిస్తున్నామని వివరించారు. రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంక్ నుంచి లిక్విడ్ హెచ్ సీఎల్ లీకైందని కలెక్టర్ వెల్లడించారు.
కాగా, పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా, పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయంటూ మండిపడ్డారు.