NVSS Prabhakar: అదానీకి రూ.100 కోట్లు తిరిగిచ్చిన రేవంత్ రెడ్డి ఆ కాంట్రాక్టర్‌కు ఎందుకివ్వలేదు?: బీజేపీ నేత ప్రభాకర్
- కాళేశ్వరం కొట్టుకుపోవడానికి కారణమైన వారి విరాళం ఎందుకు తిరిగివ్వలేదని ప్రశ్న
- కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాహుల్ గాంధీకి కుడి, ఎడమ కన్ను వంటి వారని ఎద్దేవా
- బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పరిపాలన సాగుతోందన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను తిరిగిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైన కాంట్రాక్టర్ విరాళాన్ని ఎందుకు తిరిగివ్వలేదని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాహుల్ గాంధీకి కుడి, ఎడమ కన్నులాంటి వారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలన తీరు బీఆర్ఎస్ అడుగుజాడల్లో వెళ్తున్నట్లుగానే ఉందన్నారు. బీఆర్ఎస్ సకల జనుల సర్వే అంటే కాంగ్రెస్ సమగ్ర కుల సర్వే అంటోందన్నారు. రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల మయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా ఫిరాయింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాటకాలను తాము బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణం పేరిట అయ్యప్ప సొసైటీ కట్టడాలను కేసీఆర్ ప్రభుత్వం కూల్చేసిందని, ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ నిర్మాణాలు కూల్చేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను జైలుకు పంపుతామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ అదేమీ జరగడం లేదన్నారు.
ఆరు మోసాలు... అరవై ఆరు అబద్ధాలతో టైంపాస్ చేస్తామంటే కుదరదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవడం... దాచుకోవడమేనా? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.