Rishabh Pant: రూ. 27 కోట్ల‌లో రిష‌భ్ పంత్ చేతికి వ‌చ్చేది ఎంతో తెలుసా..?

How Much Will Rishabh Pant Earn After Taxes From His Rs 27 Crore IPL Salary

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే రికార్డు స్థాయి ధ‌ర ద‌క్కించుకున్న పంత్‌
  • రూ. 27 కోట్ల‌కు పంత్‌ను కొనుగోలు చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌
  • దీనిలో రూ. 8.1 కోట్లు ప‌న్నుగా వెళ్లిపోగా అత‌ని చేతికి వ‌చ్చేది రూ. 18.9 కోట్లు

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా వికెట్ కీపర్-బ్యాటర్ రిష‌భ్ పంత్ చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ‌నోడిని రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. తద్వారా పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

వేలం స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం)ని ఉపయోగించి పంత్‌ను రూ. 20.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసేందుకు య‌త్నించింది. కానీ, ఎల్ఎస్‌జీ బిడ్‌ను అమాంతం రూ. 27 కోట్లకు పెంచి పంత్‌ను ద‌క్కించుకుంది.

అయితే, రూ.27 కోట్లలో పంత్ చేతికి వ‌చ్చేది ఎంత? అందులో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? ఒక‌వేళ అతను టోర్నమెంట్ సమయంలో లేదా అంత‌కుముందు గాయపడితే ఏం జ‌రుగుతుంది? త‌దిత‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పంత్ చేతికి వ‌చ్చేది ఎంతంటే..!
భారత ప్రభుత్వం ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం పంత్‌ మొత్తం కాంట్రాక్ట్ విలువ నుంచి రూ. 8.1 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూ. 8.1 కోట్లు ప‌న్నుగా వెళ్లిపోగా పంత్ ప్రతి సీజన్‌కు ల‌క్నో ఫ్రాంచైజీ నుంచి రూ. 18.9 కోట్లు జీతంగా పొందుతాడు. 

ఒక‌వేళ ప్లేయ‌ర్‌ గాయపడినట్లయితే ఏం జరుగుతుంది..?
ఒక‌వేళ టోర్నీకి ముందే గాయ‌ప‌డినా, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకొన్నా ఎలాంటి చెల్లింపు ఉండ‌దు. టోర్నీ మ‌ధ్య‌లో గాయ‌ప‌డి త‌ప్పుకుంటే మాత్రం పూర్తి జీతం చెల్లిస్తారు. టోర్నమెంట్‌కు ముందు గాయమైనా, వ్య‌క్తిగత కార‌ణాల‌తో త‌ప్పుకొన్నా ఆ ఆట‌గాడి స్థానంలో మ‌రో ప్లేయ‌ర్‌ను తీసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. 

టోర్నీకి ముందు గాయప‌డితే విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం చెల్లించబడదు. టీమిండియాకు ఆడుతూ గాయ‌ప‌డినా భారత ఆటగాళ్లు మాత్రం బీసీసీఐ బీమా పాలసీ ప్ర‌కారం సీజన్ తాలూకు పూర్తి డ‌బ్బును పొందుతారు.

ఒక ఆట‌గాడు (భారతీయ లేదా విదేశీ) టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండి, ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌క‌పోయినా (బెంచ్‌కే ప‌రిమిత‌మైన‌) వారికి ఫ్రాంచైజీతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం పూర్తి జీతం చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆటగాడు టోర్నమెంట్ మ‌ధ్య‌లో వైదొలిగితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా వారి చెల్లింపు ఉంటుంది. అలాగే టోర్నమెంట్ సమయంలో ఆటగాడికి గాయం అయితే, ఫ్రాంచైజీ పూర్తి కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.

  • Loading...

More Telugu News