Justice DY Chandrachud: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
- మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందన్న రాహుల్
- ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రత్యేక స్థానం ఉందన్న జస్టిస్ చంద్రచూడ్
- న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న అపోహ చాలామందిలో ఉందన్న మాజీ సీజేఐ
న్యాయ వ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చట్టాలను పరిశీలించేందుకు మాత్రమే న్యాయ వ్యవస్థ వుందని పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభల్లో న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రజలు అనుకోకూడదని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. తాజాగా ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.
ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘‘అయితే నేనిక్కడ ఒక విషయం చెప్పదలచుకున్నాను. పార్లమెంటులో, లేదంటే శాసనసభలో న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలను భావించకూడదు. న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చాలామందిలో ఓ అపోహ ఉంది. కానీ, అది నిజం కాదు, మేమున్నది చట్టాలను పరిశీలించేందుకే’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు.