Vaibhav Suryavanshi: ఐపీఎల్‌ వేలంలో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ వయసుపై ఆరోపణలు

Vaibhav Suryavanshi father quashes age fraud rumours

  • సూర్యవంశీ వయసు మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు
  • కొట్టిపడేసిన తండ్రి సంజీవ్
  • ఎనిమిదన్నరేళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్ చేసిందన్న క్రికెటర్ తండ్రి
  • కావాలంటే మరోమారు టెస్ట్ చేసుకోవచ్చంటూ బహిరంగ సవాల్

ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కిన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వయసు చుట్టూ ఆరోపణలు ముసురుకున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిన్న జరిగిన వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్‌లో ఆడబోతున్న అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు.

మరోవైపు, సూర్యవంశీ వయసు విషయంలో మోసానికి పాల్పడ్డాడంటూ వస్తున్న వార్తలపై ఆయన తండ్రి సంజీవ్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలను కొట్టిపడేసిన ఆయన.. తన కుమారుడికి వయసు నిర్ధారణ పరీక్ష చేసుకోవచ్చని బహిరంగ సవాల్ విసిరారు. సూర్యవంశీ ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్టుకు హాజరైనట్టు చెప్పారు. ఇప్పటికే అండర్-19లో ఆడాడని గుర్తు చేశారు. ఎవరికీ భయపడేదే లేదని తేల్చి చెప్పిన ఆయన.. కావాలంటే మరోమారు ఏజ్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 

బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ అండర్-19 టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో గత నెలలో చెన్నైలో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు. కేవలం 50 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్యవంశీ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన నాలుగో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.   

  • Loading...

More Telugu News