One Nation One Subscription: ‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం

Union Cabinet approved the One Nation One Subscription scheme on Monday

  • స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్
  • రూ.6 వేల కోట్ల బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఆమోదం
  • ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆర్అండ్‌డీ లేబొరేటరీలకు ఎంతో ప్రయోజనకరం
  • స్కాలర్ రీసెర్చ్, జర్నల్ ప్రచురణలకు అందరికీ యాక్సెస్
  • లేబోరేటరీల మెరుగుదలకు తోడ్పాటు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025, 2026, 2027 వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాలకు గానూ మొత్తం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ పథకం పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుందని, వినియోగం సులభంగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీలు సులువుగా ఈ పథకం లబ్దిని పొందేలా చూస్తామని తెలిపారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా విద్యారంగంలో రీసెర్చ్, ఆవిష్కరణలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ విశేషాలు ఇవే..
వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ ద్వారా రీసెర్చ్ స్కాలర్‌లకు వనరులు మెరుగుపడనున్నాయి. దేశ విద్యారంగంలో పరిశోధన ఆధారిత సంస్కృతి పెంపొందుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రయోగశాలలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడనుంది. ఇప్పటికే ఉన్న ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వంటి కార్యక్రమాలకు ఊతం ఇవ్వనుంది.

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం.. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్‌తో పాటు స్వయంప్రతిపత్తి కలిగిన యూజీసీ ఇంటర్-యూనివర్సిటీ సెంటర్‌లతో సమన్వయం చేస్తారు. దీంతో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు  నిర్వహిస్తున్న 6,300 ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు  1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతారని అంచనాగా ఉంది. వికసిత్ భారత్, జాతీయ విద్యా విధానం -2020, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యాల సాధనలో ఉపయోగపడనుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని విద్యార్థులు.. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఈ స్కీమ్ ద్వారా స్కాలర్ ప్రచురణలకు యాక్సెస్‌ లభిస్తుంది.

  • Loading...

More Telugu News