NASA: ఐడియా ఇవ్వండి... రూ.25 కోట్లు పట్టండి: నాసా ఆఫర్
- ‘లూనా రీసైకిల్ చాలెంజ్’ను ప్రకటించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ
- చంద్రుడిపైకి పంపే సామగ్రిని పునర్వియోగించగల ఆలోచనల కోసం వెతుకులాట
- ఆచరణ సాధ్యమైన ఐడియాలు ఇవ్వాలంటూ ప్రకటన
అంతరిక్షంలోకి వెళ్లి, రావడం... ఏవైనా సామగ్రిని పంపడం అత్యంత ఖరీదైన వ్యవహారం. నాసా లెక్కల ప్రకారం... అంతరిక్షంలోకి సుమారు అర కిలో బరువును పంపి, తిరిగి భూమికి చేర్చడానికి అయ్యే వ్యయం ఏకంగా రూ.84 లక్షలకుపైనే. అందుకే అంతరిక్షంలోకి పంపే ప్రతి వస్తువు దృఢంగా, వీలైనంత తేలికగా ఉండేలా చూస్తుంటారు. నాసా చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టనున్న నేపథ్యంలో.. అక్కడికి తీసుకెళ్లే వస్తువులను సమర్థవంతంగా రీసైకిల్ చేసి, తిరిగి ఏదో ఒక పనికోసం వినియోగించుకోగలిగే పరిశోధనలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వినూత్న ఐడియాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం భారీగా బహుమతినీ ప్రకటించింది.
‘లూనా రీసైకిల్ చాలెంజ్’ పేరుతో..
నాసా ఈ కార్యక్రమానికి ‘లూనా రీసైకిల్ చాలెంజ్’ అని పేరు పెట్టింది. చంద్రుడిపైకి పంపే సామగ్రిలో ప్యాకేజింగ్ మెటీరియల్, వస్త్రాలు, లోహ భాగాలు, ప్లాస్టిక్ వంటి వాటిని పునర్వినియోగించగల ఆచరణ సాధ్యమైన ఐడియాలు ఇవ్వాలని ప్రకటించింది. అత్యుత్తమ ఆచరణ సాధ్యమైన ఐడియా ఇచ్చినవారికి తొలి దశలో ఏకంగా రూ. 8.45 కోట్లు (మిలియన్ డాలర్లు) అందజేస్తామని తెలిపింది.
రెండో దశలో రూ.17 కోట్లకుపైగా...
వినూత్న ఆలోచనలను ఇచ్చినవారు రెండో దశలో.. వారి ఆలోచనలు, డిజైన్లను ఎలా సాకారం చేయాలన్న దాన్ని కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా... ప్రయోగాత్మకంగా నిరూపించడం (ప్రొటోటైప్) ద్వారా చేసి చూపిస్తే.. మరో రూ.17 కోట్లకుపైగా అందజేస్తామని నాసా వెల్లడించింది.
ఇండియన్ అమెరికన్ ఆధ్వర్యంలోనే..
ఈ చాలెంజ్ నిర్వహణ, వినూత్న ఆలోచనల పరిశీలన అంతా అలబామా యూనివర్సిటీ స్పేస్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ దొరెస్వామి ఆధ్వర్యంలో సాగుతుందని నాసా తెలిపింది. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సారథ్యంలో సదరన్ స్కూల్ కు చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగం దీనికి సహకరిస్తుందని ప్రకటించింది.